దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21:1-30
21 తర్వాత సాతాను* ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేచి, ఇశ్రాయేలీయుల్ని లెక్కపెట్టేలా దావీదును ప్రేరేపించాడు.+
2 దాంతో దావీదు యోవాబుకు,+ ప్రజల అధిపతులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు వెళ్లి, బెయేర్షెబా నుండి దాను+ వరకు ఉన్న ఇశ్రాయేలీయుల్ని లెక్కపెట్టి ఆ వివరాలు నాకు చెప్పండి, వాళ్లు ఎంతమంది ఉన్నారో నాకు తెలుస్తుంది.”
3 అయితే యోవాబు ఇలా అన్నాడు: “యెహోవా తన ప్రజల్ని 100 రెట్లు వృద్ధి చేయాలి! నా ప్రభువైన రాజా, వాళ్లందరూ నీ సేవకులే కాదా? నా ప్రభూ, నువ్వు ఎందుకిలా చేయాలనుకుంటున్నావు? నీ కారణంగా ఇశ్రాయేలు మీదికి ఎందుకు అపరాధం రావాలి?”
4 అయితే యోవాబు మాట మీద రాజు మాటే నెగ్గడంతో, యోవాబు బయల్దేరి ఇశ్రాయేలు అంతటా సంచరించి, తర్వాత యెరూషలేముకు తిరిగొచ్చాడు.+
5 యోవాబు ప్రజల సంఖ్యను దావీదుకు తెలియజేశాడు. కత్తి దూయగలవాళ్లు ఇశ్రాయేలు ప్రజలందరిలో 11,00,000 మంది, యూదాలో 4,70,000 మంది ఉన్నారు.+
6 అయితే యోవాబు లేవి, బెన్యామీను గోత్రాల వాళ్లను ఆ సంఖ్యలో చేర్చలేదు,+ ఎందుకంటే రాజు చెప్పిన మాట అతనికి అస్సలు నచ్చలేదు.+
7 దావీదు చేసిన పని వల్ల సత్యదేవునికి కోపం వచ్చింది, కాబట్టి ఆయన ఇశ్రాయేలును శిక్షించాడు.
8 అప్పుడు దావీదు సత్యదేవునితో ఇలా అన్నాడు: “నేను ఈ పని చేసి చాలా పెద్ద పాపం చేశాను.+ నేనెంతో మూర్ఖంగా ప్రవర్తించాను, దయచేసి నీ సేవకుని తప్పును క్షమించు.”+
9 అప్పుడు యెహోవా దావీదు కోసం దర్శనాలు చూసే గాదుకు+ ఇలా చెప్పాడు:
10 “నువ్వు వెళ్లి దావీదుకు ఇలా చెప్పు, ‘యెహోవా ఏమంటున్నాడంటే: “నేను నీ ముందు మూడు విషయాలు పెడుతున్నాను. వాటిలో ఏది నీ మీదికి తీసుకురమ్మంటావో చెప్పు.” ’ ”
11 గాదు దావీదు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “యెహోవా చెప్పేదేమిటంటే, ‘వీటిలో నీకు ఏది కావాలో ఎంచుకో,
12 మూడు సంవత్సరాలు కరువు రావడమా?+ నీ శత్రువుల కత్తి నిన్ను తరుముతుంటే, నువ్వు వాళ్ల చేతిలో మూడు నెలలు ఓడిపోవడమా?+ మూడు రోజులు యెహోవా కత్తితో శిక్ష పడడమా, అంటే దేశంలో తెగులు వచ్చి,+ యెహోవా దూత ఇశ్రాయేలు ప్రాంతమంతటినీ నాశనం చేయడమా?’+ నన్ను పంపించిన ఆయనకు నేను ఏం జవాబివ్వాలో జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పు.”
13 అప్పుడు దావీదు గాదుతో ఇలా అన్నాడు: “నేను పెద్ద చిక్కులో పడ్డాను. అయితే మనుషుల చేతిలో పడడం కన్నా+ యెహోవా చేతిలో పడడమే నాకు మంచిది, ఎందుకంటే ఆయన ఎంతో కరుణగల దేవుడు.”+
14 కాబట్టి యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు+ రప్పించాడు. దాంతో ఇశ్రాయేలులో 70,000 మంది చనిపోయారు.+
15 అంతేకాదు, యెరూషలేమును నాశనం చేయడానికి సత్యదేవుడు ఒక దేవదూతను పంపించాడు; అయితే ఆ దూత యెరూషలేమును నాశనం చేయడం మొదలుపెట్టగానే, యెహోవా అది చూసి తన ప్రజల విషయంలో దుఃఖపడ్డాడు.*+ నాశనం చేస్తున్న ఆ దేవదూతతో ఆయన, “చాలు!+ నీ చెయ్యి దించు” అన్నాడు. అప్పుడు, యెహోవా దూత యెబూసీయుడైన+ ఒర్నాను కళ్లం+ దగ్గర ఉన్నాడు.
16 దావీదు తలెత్తి చూసినప్పుడు, యెహోవా దూత భూమికీ ఆకాశానికీ మధ్య నిలబడివున్నాడు. ఆ దూత చేతిలో ఉన్న కత్తి+ యెరూషలేము వైపు చాపబడివుంది. గోనెపట్ట కట్టుకొనివున్న+ దావీదు, పెద్దలు వెంటనే నేలమీద సాష్టాంగపడ్డారు.+
17 దావీదు సత్యదేవునితో ఇలా అన్నాడు: “ప్రజల్ని లెక్కపెట్టమని చెప్పింది నేనే కదా? పాపం చేసింది నేను, తప్పు చేసింది నేను;+ కానీ గొర్రెల్లాంటి వీళ్లేం చేశారు? నా దేవా యెహోవా, దయచేసి నీ చెయ్యి నా మీదికి, నా తండ్రి ఇంటివాళ్ల మీదికి రానివ్వు; నీ ప్రజల మీదికి ఈ తెగులు తీసుకురాకు.”+
18 అప్పుడు, యెబూసీయుడైన ఒర్నాను కళ్లం దగ్గరికి వెళ్లి, అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టించమని దావీదుకు ఆజ్ఞాపించమని యెహోవా దూత గాదుతో+ చెప్పాడు.+
19 కాబట్టి గాదు ద్వారా యెహోవా చెప్పిన మాట ప్రకారం దావీదు అక్కడికి వెళ్లాడు.
20 ఆ సమయంలో ఒర్నాను గోధుమల్ని నూర్చుతున్నాడు, అతను వెనక్కి తిరిగినప్పుడు దేవదూత కనిపించాడు; అది చూసి అతను, అతనితో ఉన్న అతని నలుగురు కుమారులు దాక్కున్నారు.
21 దావీదు ఒర్నాను దగ్గరికి వచ్చినప్పుడు అతను దావీదును చూసి, వెంటనే కళ్లం దగ్గర నుండి బయటికి వచ్చి దావీదు ముందు సాష్టాంగపడ్డాడు.
22 అప్పుడు దావీదు ఒర్నానుతో, “కళ్లం ఉన్న ఈ స్థలాన్ని నాకు అమ్ము,* నేను ఇక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాలి. ప్రజల మీదికి వచ్చిన తెగులు ఆగిపోయేలా+ దీన్ని నాకు పూర్తి వెలకు అమ్ము” అన్నాడు.
23 అయితే ఒర్నాను దావీదుతో, “ఇది నీదే అనుకొని తీసుకో, నా ప్రభువైన రాజుకు ఏది మంచిదనిపిస్తే అది చేయాలి. ఇదిగో, నేను దహనబలుల కోసం ఎద్దులు, కట్టెల కోసం నూర్చే పనిముట్టును,+ ధాన్యార్పణ కోసం గోధుమల్ని ఇస్తున్నాను. ఇవన్నీ నీకు ఇస్తున్నాను” అన్నాడు.
24 అయితే దావీదు రాజు ఒర్నానుతో, “లేదు, నేను దాన్ని పూర్తి వెలకు కొనాల్సిందే; నీకు చెందినదాన్ని తీసుకుని నేను యెహోవాకు ఇవ్వను, వెల ఇవ్వకుండా తీసుకున్న* వాటిని నేను దహనబలులుగా అర్పించను” అన్నాడు.+
25 కాబట్టి దావీదు ఆ స్థలం కోసం ఒర్నానుకు 600 షెకెల్‌ల* బంగారం తూచి ఇచ్చాడు.
26 దావీదు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టి+ దహనబలుల్ని, సమాధాన బలుల్ని అర్పించాడు; అతను యెహోవా పేరున ప్రార్థించాడు, అప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్ని పంపించి, దహనబలులు అర్పించే బలిపీఠం మీద ఉన్న వాటిని దహించడం ద్వారా దావీదుకు జవాబిచ్చాడు.+
27 తర్వాత, కత్తిని తిరిగి ఒరలో పెట్టమని యెహోవా దూతకు ఆజ్ఞాపించాడు.+
28 యెబూసీయుడైన ఒర్నాను కళ్లం దగ్గర యెహోవా తనకు జవాబిచ్చాడని చూసిన దావీదు అక్కడ బలులు అర్పిస్తూ ఉన్నాడు.
29 అయితే ఎడారిలో మోషే చేయించిన యెహోవా గుడారం, అలాగే దహనబలులు అర్పించే బలిపీఠం ఆ సమయంలో గిబియోనులోని ఉన్నత స్థలం మీద ఉన్నాయి.+
30 అయితే దావీదు యెహోవా దూత పట్టుకున్న ఖడ్గానికి భయపడి, దేవుని దగ్గర విచారణ చేయడానికి అక్కడికి వెళ్లలేకపోయాడు.
అధస్సూచీలు
^ లేదా “ఎదిరించేవాడు” అయ్యుంటుంది.
^ లేదా “విచారపడ్డాడు.”
^ అక్ష., “ఇవ్వు.”
^ లేదా “నాకు ఏ ఖర్చూ అవ్వని.”
^ అప్పట్లో ఒక షెకెల్ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.