రెండో కొరింథీయులు 11:1-33
11 నేను కాస్త అవివేకిలా కనిపించినా, మీరు నన్ను సహించాలని కోరుకుంటున్నాను. నిజానికి ఇప్పటికే మీరు అలా చేస్తున్నారు!
2 మీ మీద నాకున్న ఆసక్తి దేవునికున్న ఆసక్తి లాంటిది. ఎందుకంటే నేను మీకు ఒక్క భర్తతో, అంటే క్రీస్తుతో పెళ్లి నిశ్చయం చేశాను, మిమ్మల్ని పవిత్రమైన* కన్యగా ఆయనకు అప్పగించాలని అనుకుంటున్నాను.+
3 అయితే సర్పం కుయుక్తితో హవ్వను మోసం చేసినట్టే,+ మీ మనసులు కూడా ఏదోవిధంగా కలుషితమైపోతాయేమో, క్రీస్తుకు చెందాల్సిన నిజాయితీని, పవిత్రతను* మీరు పోగొట్టుకుంటారేమో+ అని నేను భయపడుతున్నాను.
4 ఎందుకంటే ఎవరైనా వచ్చి, మేము ప్రకటించిన యేసును కాకుండా ఇంకో యేసును ప్రకటించినా, ఇప్పుడు మీ మనసుల్ని ప్రభావితం చేస్తున్న ఆలోచనా విధానాన్ని* కాకుండా వేరే ఆలోచనా విధానాన్ని ప్రవేశపెట్టినా, మీరు స్వీకరించిన మంచివార్తను కాకుండా ఇంకో మంచివార్తను ప్రకటించినా+ మీరు వెంటనే అతని మాటల్ని ఒప్పుకుంటారు.
5 నేను అతిశ్రేష్ఠులైన మీ అపొస్తలుల కన్నా ఏ విషయంలోనూ తక్కువవాణ్ణి కానని అనుకుంటున్నాను.+
6 మాట్లాడే విషయంలో నాకు అంతగా నైపుణ్యం లేకపోయినా,+ జ్ఞానం విషయంలో మాత్రం అస్సలు అలా కాదు; నిజానికి ఆ జ్ఞానాన్ని మేము ప్రతీ విషయంలో, ప్రతీ విధంగా మీకు స్పష్టం చేశాం.
7 దేవుని మంచివార్తను మీకు ఉచితంగా ప్రకటిస్తూ,+ మీకు ఘనత రావడం కోసం నన్ను నేను తగ్గించుకుని పాపం చేశానా?
8 మీకు పరిచారం చేయడం కోసం నేను వేరే సంఘాల దగ్గర సహాయం తీసుకొని ఒకవిధంగా వాళ్లను దోచుకున్నాను.+
9 అయినాసరే, నేను మీ దగ్గర ఉన్న సమయంలో నాకు కొన్ని అవసరమైనప్పుడు నేను ఎవ్వరికీ భారంగా తయారవ్వలేదు. ఎందుకంటే మాసిదోనియ నుండి వచ్చిన సహోదరులు నాకు అవసరమైన వాటిని సమృద్ధిగా ఇచ్చారు.+ అవును, నేను మీకు ఏ విధంగానూ భారంగా ఉండకుండా జాగ్రత్తపడ్డాను, ముందుముందు కూడా అలాగే ఉంటాను.+
10 నేను క్రీస్తు శిష్యునిగా ఉన్నంతకాలం అకయ ప్రాంతాల్లో ఇలా గొప్పలు చెప్పుకోవడం ఆపను.+
11 నేను మీకు భారంగా లేనిది ఎందుకు? మీ మీద ప్రేమ లేకనా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని దేవుడికి తెలుసు.
12 నేను ఇప్పుడు చేస్తున్నది ఇకముందు కూడా చేస్తాను.+ అప్పుడు, తమ హోదా గురించి గొప్పలు చెప్పుకుంటూ మాతో సమానంగా ఉండాలని ప్రయత్నించేవాళ్లకు గొప్పలు చెప్పుకునే అవకాశమే లేకుండా చేయగలుగుతాను.
13 అలాంటివాళ్లు దొంగ అపొస్తలులు, మోసగాళ్లు, వాళ్లు క్రీస్తు అపొస్తలుల్లా వేషం వేసుకుంటున్నారు.+
14 ఇందులో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే స్వయంగా సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటూ ఉంటాడు.+
15 కాబట్టి అతని పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేసుకుంటూ ఉండడం వింతేమీ కాదు. వాళ్ల అంతం వాళ్ల పనులకు తగ్గట్టే ఉంటుంది.+
16 నేను మళ్లీ చెప్తున్నాను: నేను అవివేకినని ఎవ్వరూ అనుకోకూడదు. ఒకవేళ మీరు అలా అనుకున్నా, అవివేకిగానే నన్ను స్వీకరించండి. అప్పుడు నేను కూడా కాస్త గొప్పలు చెప్పుకోగలుగుతాను.
17 నేను ఇప్పుడు ప్రభువు ఆదర్శాన్ని పాటిస్తున్న వ్యక్తిలా కాకుండా ఆత్మవిశ్వాసంతో గొప్పలు చెప్పుకునే అవివేకిలా మాట్లాడుతున్నాను.
18 చాలామంది, లోకసంబంధమైన వాటి గురించి* గొప్పలు చెప్పుకుంటున్నారు కాబట్టి నేను కూడా అలాగే గొప్పలు చెప్పుకుంటాను.
19 మీరు “వివేకులు” కాబట్టి అవివేకుల్ని సంతోషంగా సహిస్తున్నారు.
20 నిజానికి, మిమ్మల్ని బానిసలుగా చేసుకునేవాళ్లను, మీ ఆస్తిపాస్తుల్ని మింగేసేవాళ్లను, మీకున్న వాటిని లాక్కునేవాళ్లను, మీ మీద పెత్తనం చెలాయించేవాళ్లను, మిమ్మల్ని ముఖం మీద కొట్టేవాళ్లను మీరు సహిస్తున్నారు.
21 ఇలా మాట్లాడడం మాకే అవమానం. ఎందుకంటే కొందరి దృష్టికి మేము బలహీనంగా ప్రవర్తించినట్టు అనిపించవచ్చు.
కానీ ఇతరులు ధైర్యంగా ప్రవర్తిస్తే నేను కూడా ధైర్యంగా ప్రవర్తిస్తాను,* నేను అవివేకిలా కనిపించినా సరే అలా చేస్తాను.
22 వాళ్లు హెబ్రీయులా? నేనూ హెబ్రీయుణ్ణే.+ వాళ్లు ఇశ్రాయేలీయులా? నేనూ ఇశ్రాయేలీయుణ్ణే. వాళ్లు అబ్రాహాము సంతానమా?* నేను కూడా అబ్రాహాము సంతానాన్నే.+
23 వాళ్లు క్రీస్తు పరిచారకులా? పిచ్చివాడిలా అరుస్తూ చెప్తాను, నేను వాళ్లకన్నా అసాధారణ రీతిలో క్రీస్తు పరిచారకుణ్ణి: వాళ్లకన్నా ఎక్కువ పని చేశాను,+ ఎక్కువసార్లు చెరసాలలో వేయబడ్డాను,+ లెక్కలేనన్ని దెబ్బలు తిన్నాను, ఎన్నోసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను,+
24 ఐదుసార్లు యూదుల చేతుల్లో ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను.+
25 మూడుసార్లు నన్ను కర్రలతో కొట్టారు,+ ఒకసారి రాళ్లతో కొట్టారు,+ మూడు సందర్భాల్లో నేను ప్రయాణిస్తున్న ఓడ బద్దలైంది,+ ఒక రాత్రీ పగలూ సముద్రంలో గడిపాను,
26 ఎన్నో ప్రయాణాలు చేశాను; నదుల్లో, దొంగల చేతుల్లో, నా సొంత ప్రజల చేతుల్లో,+ అన్యజనుల చేతుల్లో,+ నగరంలో,+ ఎడారిలో,* సముద్రంలో, కపట సహోదరుల చేతుల్లో ప్రమాదాలు ఎదుర్కొన్నాను;
27 చెమటోడ్చి కష్టపడ్డాను, ఎన్నోసార్లు నిద్రలేని రాత్రులు గడిపాను,+ ఆకలిదప్పులతో బాధపడ్డాను,+ చాలాసార్లు పస్తులున్నాను,+ చలిలో ఉన్నాను, వేసుకోవడానికి బట్టలు లేకుండా గడిపాను.
28 ఇవేకాక, సంఘాలన్నిటి గురించిన చింత కూడా ప్రతీరోజు నన్ను కలచివేస్తోంది.+
29 ఎవరైనా బలహీనంగా ఉంటే నేను బాధపడనా? ఎవరైనా విశ్వాసంలో తడబడితే నా మనసు రగిలిపోదా?
30 నేను గొప్పలు చెప్పుకోవాల్సి వస్తే, నా బలహీనతను చూపించే విషయాల గురించే గొప్పలు చెప్పుకుంటాను.
31 నేను అబద్ధమాడట్లేదని యేసు ప్రభువుకు తండ్రైన దేవునికి, అంటే నిరంతరం స్తుతించబడాల్సిన దేవునికి తెలుసు.
32 దమస్కులో అరెత రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టుకోవాలని దమస్కు నగరానికి కాపలా పెట్టించాడు.
33 కానీ సహోదరులు నన్ను ఒక గంపలో పెట్టి నగర ప్రాకారానికి ఉన్న కిటికీలో నుండి కిందికి దించారు,+ అలా నేను అతనికి దొరకకుండా తప్పించుకున్నాను.
అధస్సూచీలు
^ లేదా “స్వచ్ఛమైన.”
^ లేదా “స్వచ్ఛతను.”
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ అక్ష., “శరీర ప్రకారం.”
^ లేదా “గొప్పలు చెప్పుకోవడానికి సిగ్గుపడకపోతే, నేను కూడా సిగ్గుపడను.”
^ అక్ష., “విత్తనమా?”