దినవృత్తాంతాలు రెండో గ్రంథం 21:1-20

  • యెహోరాము, యూదా రాజు (1-11)

  • ఏలీయా రాసిన లేఖ (12-15)

  • యెహోరాము ఘోరమైన ముగింపు (16-20)

21  తర్వాత యెహోషాపాతు చనిపోయాడు;* అతన్ని దావీదు నగరంలో అతని పూర్వీకులతోపాటు పాతిపెట్టారు; అతని స్థానంలో అతని కుమారుడు యెహోరాము రాజయ్యాడు.  అతని సహోదరులు, అంటే యెహోషాపాతు కుమారులు ఎవరంటే, అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్య; వీళ్లందరూ ఇశ్రాయేలు రాజైన యెహోషాపాతు కుమారులు.  వాళ్ల తండ్రి వాళ్లకు యూదాలోని ప్రాకారాలుగల నగరాల్ని+ ఇచ్చాడు, అలాగే వెండి, బంగారం రూపంలో ఎన్నో బహుమానాల్ని, విలువైన వస్తువుల్ని ఇచ్చాడు; అయితే యెహోరాము+ పెద్ద కుమారుడు కాబట్టి అతనికి రాజ్యాన్ని ఇచ్చాడు.  యెహోరాము తన తండ్రి రాజ్యాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత, తన సహోదరులందర్నీ, అలాగే కొంతమంది ఇశ్రాయేలు అధిపతుల్ని కత్తితో చంపి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.+  యెహోరాము రాజైనప్పుడు అతనికి 32 ఏళ్లు, అతను యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు.+  అతను అహాబు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు+ కాబట్టి అహాబు ఇంటివాళ్లలాగే అతను ఇశ్రాయేలు రాజుల మార్గంలో నడిచాడు;+ అతను యెహోవా దృష్టికి చెడు చేస్తూ ఉన్నాడు.  కానీ యెహోవా తాను దావీదుతో చేసిన ఒప్పందం+ కారణంగా దావీదు వంశాన్ని నాశనం చేయాలనుకోలేదు. ఎందుకంటే ఆయన దావీదుకు, అతని కుమారులకు ఎప్పుడూ ఒక దీపాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు.+  అతని రోజుల్లో ఎదోమువాళ్లు యూదా మీద తిరుగుబాటు చేసి+ సొంత రాజును నియమించుకున్నారు.+  కాబట్టి యెహోరాము తన సైన్యాధికారుల్ని, రథాలన్నిటినీ తీసుకొని అక్కడికి వెళ్లాడు. అతను రాత్రిపూట లేచి తననూ, రథాధిపతుల్నీ చుట్టుముడుతున్న ఎదోమీయుల్ని ఓడించాడు. 10  అయినాసరే ఎదోమువాళ్లు ఈ రోజు వరకు యూదా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో లిబ్నావాళ్లు+ కూడా యెహోరాము మీద తిరుగుబాటు చేశారు. ఎందుకంటే అతను తన పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టాడు.+ 11  అంతేకాదు, అతను యూదా పర్వతాల మీద ఉన్నత స్థలాల్ని+ కట్టించి, యెరూషలేము నివాసులు దేవునికి నమ్మకద్రోహం చేయడానికి* కారకుడయ్యాడు. అతను యూదాను తప్పుదారి పట్టించాడు. 12  కొంతకాలానికి, ఏలీయా+ ప్రవక్త నుండి అతనికి ఒక లేఖ అందింది; దానిలో ఇలా ఉంది: “నీ పూర్వీకుడైన దావీదు దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, ‘నువ్వు నీ తండ్రి యెహోషాపాతు మార్గాల్లో+ గానీ యూదా రాజైన ఆసా మార్గాల్లో+ గానీ నడవలేదు. 13  కానీ నువ్వు ఇశ్రాయేలు రాజుల మార్గంలో+ నడిచావు; యూదావాళ్లు, యెరూషలేము నివాసులు అహాబు ఇంటివాళ్లలాగే+ దేవుని పట్ల నమ్మకద్రోహానికి+ పాల్పడేలా* చేశావు. నీ కన్నా ఉత్తములైన నీ తండ్రి ఇంటివాళ్లను, అంటే నీ సొంత సహోదరుల్ని చంపావు.+ 14  కాబట్టి యెహోవా నీ ప్రజల మీద, నీ కుమారుల మీద, నీ భార్యల మీద, నీ ఆస్తి అంతటి మీద పెద్ద విపత్తు తీసుకొస్తున్నాడు. 15  పేగులకు వచ్చే ఒక జబ్బుతోపాటు చాలా రకాల జబ్బులతో నువ్వు బాధపడతావు. ఆ జబ్బు రోజురోజుకీ ముదిరి చివరికి నీ పేగులు బయటికి వస్తాయి.’ ” 16  యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయుల్ని,+ ఇతియోపీయుల దగ్గరున్న అరబీయుల్ని+ రేపాడు.+ 17  వాళ్లు యూదా మీద దండెత్తి దానిలోకి చొచ్చుకొని వచ్చి, రాజభవనంలో ఉన్న సంపదంతా దోచుకున్నారు;+ వాళ్లు యెహోరాము కుమారుల్ని, భార్యల్ని కూడా తీసుకెళ్లారు; అతనికి తన చిన్న కుమారుడైన యెహోయాహాజు*+ మాత్రమే మిగిలాడు. 18  ఇదంతా జరిగిన తర్వాత, యెహోవా అతన్ని పేగులకు సంబంధించిన ఒక నయంకాని జబ్బుతో మొత్తాడు.+ 19  కొంతకాలం గడిచాక అంటే సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయ్యాక, జబ్బు వల్ల అతని పేగులు బయటికి వచ్చాయి; అతను జబ్బుతో తీవ్రంగా బాధపడి చనిపోయాడు; ప్రజలు అతని పూర్వీకులకు చేసినట్టు, అతని గౌరవార్థం మంట వేయలేదు.+ 20  రాజైనప్పుడు అతని వయసు 32 ఏళ్లు; అతను యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు. అతను చనిపోయినప్పుడు ఎవ్వరూ బాధపడలేదు. అతన్ని దావీదు నగరంలో పాతిపెట్టారు+ కానీ రాజుల సమాధుల్లో పాతిపెట్టలేదు.+

అధస్సూచీలు

అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”
లేదా “ఆధ్యాత్మిక వ్యభిచారం చేయడానికి.”
లేదా “ఆధ్యాత్మిక వ్యభిచారం చేసేలా.”
అహజ్యా అని కూడా పిలవబడ్డాడు.