దినవృత్తాంతాలు రెండో గ్రంథం 3:1-17
3 తర్వాత సొలొమోను యెరూషలేములో మోరీయా పర్వతం+ మీద, యెబూసీయుడైన ఒర్నాను కళ్లం* మీద దావీదు సిద్ధం చేసిన స్థలంలో+ యెహోవా మందిరాన్ని కట్టించడం మొదలుపెట్టాడు.+ అంతకుముందు ఆ స్థలంలోనే అతని తండ్రైన దావీదుకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు.+
2 సొలొమోను తన పరిపాలన నాలుగో సంవత్సరం, రెండో నెల, రెండో రోజున దాన్ని కట్టించడం మొదలుపెట్టాడు.
3 పాత కొలత* ప్రకారం, సత్యదేవుని మందిరాన్ని కట్టించడానికి సొలొమోను వేసిన పునాది పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు.+
4 ముందున్న వసారా వెడల్పు మందిరం వెడల్పుతో సమానం. అది 20 మూరలు ఉంది. దాని ఎత్తు 20 మూరలు;* అతను దాని లోపలి భాగాన్ని స్వచ్ఛమైన బంగారు రేకుతో కప్పించాడు.+
5 అతను పెద్ద గదిని సరళవృక్షం పలకలతో కప్పించి, దాన్ని మేలిమి బంగారు రేకుతో కప్పించాడు.+ అతను దాన్ని ఖర్జూర చెట్టు చిత్రాలతో,+ గొలుసులతో అలంకరించాడు.+
6 అంతేకాదు, ఆ మందిరాన్ని అందమైన రత్నాలతో పొదిగించాడు;+ అతను పర్వయీము నుండి వచ్చిన బంగారాన్ని+ ఉపయోగించాడు.
7 అతను మందిరాన్ని, దూలాల్ని, గడపల్ని, దాని గోడల్ని, దాని తలుపుల్ని బంగారు రేకుతో కప్పించాడు;+ గోడల మీద కెరూబుల్ని చెక్కించాడు.+
8 తర్వాత సొలొమోను అతి పవిత్ర స్థలాన్ని+ చేయించాడు; దాని పొడవు 20 మూరలు, అది మందిరం వెడల్పుతో సమానం. దాని వెడల్పు 20 మూరలు. అతను దాన్ని 600 తలాంతుల* మేలిమి బంగారు రేకులతో కప్పించాడు.+
9 అతను మేకుల కోసం ఉపయోగించిన బంగారం బరువు 50 షెకెల్‌లు;* అతను పైగదుల్ని బంగారు రేకుతో కప్పించాడు.
10 తర్వాత సొలొమోను అతి పవిత్ర స్థలంలో రెండు కెరూబుల్ని చేయించి, వాటిని బంగారు రేకుతో కప్పించాడు.+
11 ఆ కెరూబుల రెక్కల+ మొత్తం పొడవు 20 మూరలు; మొదటి కెరూబు ఒక రెక్క పొడవు ఐదు మూరలు, అది మందిరం గోడను తాకుతుంది; రెండో రెక్క పొడవు ఐదు మూరలు, అది రెండో కెరూబు రెక్కల్లో ఒకదాన్ని తాకుతుంది.
12 రెండో కెరూబు ఒక రెక్క పొడవు ఐదు మూరలు, అది మందిరం మరో గోడను తాకుతుంది; రెండో రెక్క పొడవు ఐదు మూరలు, అది మొదటి కెరూబు రెక్కల్లో ఒకదాన్ని తాకుతుంది.
13 చాపివున్న ఆ కెరూబుల రెక్కలు 20 మూరల పొడవు ఉన్నాయి. ఆ కెరూబులు తమ పాదాల మీద నిలబడి ఉన్నాయి. వాటి ముఖాలు లోపలి వైపుకు* తిరిగివున్నాయి.
14 అంతేకాదు అతను నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో, ముదురు ఎరుపు రంగు దారంతో, నాణ్యమైన వస్త్రంతో తెరను+ తయారుచేయించి, దానిమీద కెరూబు బొమ్మల్ని కుట్టించాడు.+
15 తర్వాత అతను మందిరం ముందు భాగంలో రెండు స్తంభాల్ని+ చేయించాడు. వాటి ఎత్తు 35 మూరలు, ఒక్కో స్తంభం మీద ఉన్న శీర్షం ఎత్తు ఐదు మూరలు.+
16 అతను గొలుసుల్ని చేయించి శీర్షాల చుట్టూ వేలాడదీయించాడు, అతను 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసులకు తగిలించాడు.
17 అతను ఆలయం ముందు భాగంలో కుడివైపు* ఒక స్తంభాన్ని, ఎడమవైపు* ఒక స్తంభాన్ని నిలబెట్టించాడు. అతను కుడివైపు స్తంభానికి యాకీను* అని, ఎడమవైపు స్తంభానికి బోయజు* అని పేరుపెట్టాడు.
అధస్సూచీలు
^ అప్పట్లో ఒక ప్రామాణిక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం; అయితే “పాత కొలత” అనేది 51.8 సెంటీమీటర్లతో (20.4 అంగుళాలతో) సమానమైన పొడవైన మూరను సూచిస్తుందని కొందరి అభిప్రాయం. అనుబంధం B14 చూడండి.
^ కొన్ని ప్రాచీన చేతిరాత ప్రతుల్లో “ఎత్తు 120” అని ఉంది. కానీ వేరే చేతిరాత ప్రతుల్లో, అలాగే కొన్ని అనువాదాల్లో “ఎత్తు 20 మూరలు” అని ఉంది.
^ అప్పట్లో ఒక తలాంతు 34.2 కిలోలతో సమానం. అనుబంధం B14 చూడండి.
^ అప్పట్లో ఒక షెకెల్ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
^ అంటే, పవిత్ర స్థలం వైపుకు.
^ లేదా “దక్షిణం వైపు.”
^ లేదా “ఉత్తరం వైపు.”
^ “ఆయన [అంటే, యెహోవా] గట్టిగా స్థిరపర్చాలి” అని అర్థం.
^ బహుశా “శక్తితో” అనే అర్థం ఉండవచ్చు.