దినవృత్తాంతాలు రెండో గ్రంథం 7:1-22

  • ఆలయం యెహోవా మహిమతో నిండడం (1-3)

  • ప్రతిష్ఠాపన సంబరాలు (4-10)

  • సొలొమోనుకు యెహోవా కలలో కనిపించడం (11-22)

7  సొలొమోను ప్రార్థన చేయడం ముగించగానే, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి+ దహనబలిని, బలుల్ని దహించేసింది, మందిరం యెహోవా మహిమతో నిండిపోయింది.+  యెహోవా మందిరం యెహోవా మహిమతో నిండిపోవడంవల్ల యాజకులు యెహోవా మందిరంలోకి ప్రవేశించలేకపోయారు.+  అగ్ని దిగిరావడం, యెహోవా మహిమ మందిరం మీద ఉండడం ఇశ్రాయేలు ప్రజలంతా చూస్తూ ఉన్నారు; వాళ్లు కిందికి వంగి రాతి నేలపై సాష్టాంగపడి, “ఎందుకంటే ఆయన మంచివాడు; ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది” అని అంటూ యెహోవాకు కృతజ్ఞతలు చెప్పారు.  అప్పుడు రాజు, అలాగే ప్రజలందరూ యెహోవా ఎదుట బలులు అర్పించారు.+  సొలొమోను రాజు 22,000 ఎద్దుల్ని, 1,20,000 గొర్రెల్ని బలిగా అర్పించాడు. అలా రాజు, ప్రజలందరూ సత్యదేవుని మందిరాన్ని ప్రతిష్ఠించారు.+  అప్పుడు యాజకులు తమ స్థానాల్లో నిలబడివున్నారు; లేవీయులు కూడా యెహోవాకు పాటలు పాడేటప్పుడు ఉపయోగించే వాద్యాలు పట్టుకొని నిలబడివున్నారు.+ (దావీదు వాళ్లతో* కలిసి స్తుతించేటప్పుడు, “ఎందుకంటే ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది” అని అంటూ యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించడానికి ఆ వాద్యాల్ని చేయించాడు.) యాజకులు వాళ్ల ఎదురుగా బిగ్గరగా బాకాలు ఊదుతున్నారు.+ ఆ సమయంలో ఇశ్రాయేలీయులందరూ నిలబడి ఉన్నారు.  సొలొమోను దహనబలుల్ని,+ సమాధాన బలుల కొవ్విన భాగాల్ని అర్పించాల్సి ఉంది కాబట్టి అతను యెహోవా మందిరం ఎదుట ఉన్న ప్రాంగణం మధ్యభాగాన్ని పవిత్రపర్చాడు. ఎందుకంటే సొలొమోను చేయించిన రాగి బలిపీఠం+ దహనబలులకు, ధాన్యార్పణలకు,+ కొవ్విన భాగాలకు సరిపోలేదు.+  ఆ సమయంలో సొలొమోను ఇశ్రాయేలీయులందరితో, అంటే లెబో-హమాతు* నుండి కింద ఐగుప్తు వాగు* వరకు+ ఉన్న గొప్ప సమాజంతో కలిసి ఏడురోజుల పాటు పండుగ ఆచరించాడు.+  వాళ్లు బలిపీఠం ప్రతిష్ఠాపనను ఏడురోజులు, పండుగను ఏడురోజులు జరుపుకున్నారు; ఎనిమిదో రోజున* ప్రత్యేక సమావేశం జరుపుకున్నారు.+ 10  సొలొమోను ఏడో నెల 23వ రోజున ప్రజల్ని వాళ్ల ఇళ్లకు పంపించాడు. యెహోవా దావీదు మీద, సొలొమోను మీద, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద చూపించిన మంచితనాన్ని బట్టి వాళ్లు ఉల్లాసంతో,+ హృదయానందంతో తమ ఇళ్లకు వెళ్లిపోయారు.+ 11  అలా సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని కట్టించడం పూర్తిచేశాడు. యెహోవా మందిరానికి, తన రాజభవనానికి సంబంధించి అతను అనుకున్న ప్రతీది విజయవంతంగా పూర్తిచేశాడు. 12  రాత్రిపూట యెహోవా సొలొమోనుకు కలలో కనిపించి+ ఇలా అన్నాడు: “నేను నీ ప్రార్థన విన్నాను, నా కోసం బలి అర్పించే మందిరంగా నేను ఈ స్థలాన్ని ఎంచుకున్నాను.+ 13  నేను ఆకాశం మూయడం వల్ల వర్షాలు కురవనప్పుడు, దేశాన్ని నాశనం చేయమని మిడతలకు* ఆజ్ఞాపించినప్పుడు, నా ప్రజల మధ్యకు తెగులును పంపించినప్పుడు, 14  నా పేరుతో పిలవబడిన నా ప్రజలు+ తమను తాము తగ్గించుకొని,+ ప్రార్థించి నా కోసం వెదికి, తమ చెడు మార్గాల్ని విడిచిపెడితే,+ నేను పరలోకం నుండి వాళ్ల ప్రార్థనలు విని వాళ్ల పాపాల్ని క్షమిస్తాను, వాళ్ల దేశాన్ని బాగుచేస్తాను. 15  ఈ స్థలంలో చేసే ప్రార్థనల మీద నా దృష్టి నిలుపుతాను, వాటిని చెవులారా ఆలకిస్తాను. 16  నా పేరు శాశ్వతంగా ఇక్కడ ఉండేలా నేను ఈ మందిరాన్ని ఎంచుకొని, దాన్ని పవిత్రపర్చాను;+ నా దృష్టి, నా హృదయం ఎప్పుడూ ఇక్కడ ఉంటాయి.+ 17  “నువ్వు నేను ఆజ్ఞాపించినవన్నీ చేస్తూ నీ తండ్రి దావీదులా నా ఎదుట నడుచుకుంటే, నా శాసనాలకు, తీర్పులకు లోబడితే, 18  ‘ఇశ్రాయేలును పరిపాలించే వ్యక్తి నీ రాజవంశంలో ఎప్పుడూ ఉంటాడు’+ అని నేను నీ తండ్రి దావీదుతో ఒప్పందం చేసినట్టు+ నీ రాజ్య సింహాసనాన్ని స్థిరపరుస్తాను. 19  కానీ మీరు పక్కకు మళ్లి, నేను మీకు ఇచ్చిన నా శాసనాల్ని, ఆజ్ఞల్ని వదిలేస్తే, వెళ్లి వేరే దేవుళ్లను సేవించి వాటికి మొక్కితే,+ 20  నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన నా దేశం నుండి వాళ్లను పెకిలించి,+ నా పేరు కోసం నేను పవిత్రపర్చిన ఈ మందిరాన్ని నా కళ్లముందు ఉండకుండా తీసేస్తాను, అన్నిదేశాలు దాన్ని ఈసడించుకుంటాయి,* అపహాస్యం చేస్తాయి.+ 21  ఈ మందిరం శిథిలాల దిబ్బ అవుతుంది. దీని పక్కన నుండి వెళ్లే ప్రతీ ఒక్కరు ఆశ్చర్యంగా చూస్తూ,+ ‘యెహోవా ఈ దేశాన్ని, ఈ మందిరాన్ని ఎందుకు ఇలా చేశాడు?’ అని చెప్పుకుంటారు.+ 22  అప్పుడు వాళ్లు ఇలా అంటారు, ‘ఎందుకంటే, వాళ్లు ఐగుప్తు దేశం నుండి తమను బయటికి తీసుకొచ్చిన తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టారు;+ వేరే దేవుళ్లను హత్తుకొని వాటికి మొక్కి, వాటిని సేవించారు.+ అందుకే ఆయన వాళ్ల మీద ఈ విపత్తునంతటినీ తీసుకొచ్చాడు.’ ”+

అధస్సూచీలు

లేవీయుల్ని సూచిస్తుండవచ్చు.
లేదా “హమాతు ప్రవేశ ద్వారం.”
పదకోశం చూడండి.
పండుగ తర్వాతి రోజు, లేదా 15వ రోజు.
లేదా “గొల్లభామలకు.”
లేదా “దాని మీద సామెత చెప్పుకుంటాయి.”