రాజులు రెండో గ్రంథం 2:1-25

  • ఏలీయాను సుడిగాలిలో పైకి తీసుకెళ్లడం (1-18)

    • ఏలీయా అధికారిక వస్త్రాన్ని ఎలీషా తీసుకోవడం (13, 14)

  • ఎలీషా యెరికో నీళ్లను బాగుచేయడం (19-22)

  • ఎలుగుబంట్లు బేతేలు పిల్లల్ని చంపడం (23-25)

2  యెహోవా ఏలీయాను+ సుడిగాలిలో ఆకాశానికి తీసుకెళ్లే సమయం వచ్చినప్పుడు+ ఏలీయా, ఎలీషా+ గిల్గాలు+ నుండి బయల్దేరారు.  అప్పుడు ఏలీయా ఎలీషాతో, “దయచేసి నువ్వు ఇక్కడే ఉండు. యెహోవా నన్ను బేతేలుకు వెళ్లమన్నాడు” అని అన్నాడు. కానీ ఎలీషా, “యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడిచిపెట్టను” అన్నాడు. వాళ్లు బేతేలుకు+ వెళ్లారు.  తర్వాత బేతేలులోని ప్రవక్తల కుమారులు* ఎలీషా దగ్గరికి వచ్చి, “యెహోవా నీ యజమానిని తీసుకెళ్తున్నాడని, నీ నాయకుడు నిన్ను విడిచివెళ్తున్నాడని నీకు తెలుసా?”+ అన్నారు. దానికి అతను, “నాకు తెలుసు, దాని గురించి మాట్లాడకండి” అన్నాడు.  తర్వాత ఏలీయా, “ఎలీషా, దయచేసి నువ్వు ఇక్కడే ఉండు. యెహోవా నన్ను యెరికోకు+ వెళ్లమన్నాడు” అని అన్నాడు. కానీ ఎలీషా, “యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడిచిపెట్టను” అన్నాడు. వాళ్లు యెరికోకు వచ్చారు.  అప్పుడు యెరికోలోని ప్రవక్తల కుమారులు ఎలీషా దగ్గరికి వచ్చి, “యెహోవా నీ యజమానిని తీసుకెళ్తున్నాడని, నీ నాయకుడు నిన్ను విడిచివెళ్తున్నాడని నీకు తెలుసా?” అన్నారు. దానికి అతను, “నాకు తెలుసు, దాని గురించి మాట్లాడకండి” అన్నాడు.  తర్వాత ఏలీయా ఎలీషాతో, “దయచేసి నువ్వు ఇక్కడే ఉండు. యెహోవా నన్ను యొర్దానుకు వెళ్లమన్నాడు” అని అన్నాడు. కానీ అతను, “యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడిచిపెట్టను” అన్నాడు. దాంతో వాళ్లిద్దరూ ప్రయాణాన్ని కొనసాగించారు.  ప్రవక్తల కుమారుల్లో 50 మంది వాళ్ల వెనకే వచ్చి, వాళ్లిద్దరూ యొర్దాను నది దగ్గర నిలబడివున్నప్పుడు దూరం నుండి గమనిస్తూ ఉన్నారు.  అప్పుడు, ఏలీయా తన అధికారిక వస్త్రాన్ని+ తీసి, చుట్టి, దానితో నీళ్లమీద కొట్టాడు. దాంతో ఆ నది రెండుగా విడిపోయింది, వాళ్లిద్దరూ పొడినేల మీద నడిచి ఆ నది దాటారు.+  వాళ్లు నది దాటగానే ఏలీయా ఎలీషాతో, “దేవుడు నన్ను నీ దగ్గర నుండి తీసుకెళ్లకముందే నీ కోసం నన్నేమి చేయమంటావో అడుగు” అన్నాడు. దానికి ఎలీషా, “దయచేసి నీలో ఉన్న దేవుని పవిత్రశక్తిలో రెండు పాళ్లు+ నాకు ఇవ్వు”+ అని అడిగాడు. 10  అప్పుడు ఏలీయా, “నువ్వు కష్టమైనదాన్ని అడిగావు. దేవుడు నన్ను నీ దగ్గర నుండి తీసుకెళ్తున్నప్పుడు నువ్వు నన్ను చూస్తే, నువ్వు అడిగినట్టు జరుగుతుంది; నువ్వు చూడకపోతే, అలా జరగదు” అన్నాడు. 11  వాళ్లు అలా మాట్లాడుతూ నడుస్తుండగా, ఉన్నట్టుండి ఒక అగ్ని రథం, అగ్ని గుర్రాలు+ వాళ్లిద్దర్నీ వేరు చేశాయి, ఏలీయా సుడిగాలిలో ఆకాశానికి వెళ్లాడు.+ 12  ఎలీషా అది చూస్తూ, “నా తండ్రీ, నా తండ్రీ! ఇదిగో, ఇశ్రాయేలు రథం, దాని గుర్రపురౌతులు!”+ అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఏలీయా అతనికి ఇక కనిపించలేదు, అప్పుడు ఎలీషా తన వస్త్రాల్ని పట్టుకొని రెండు ముక్కలుగా చించాడు.+ 13  తర్వాత అతను ఏలీయా మీద నుండి పడిపోయిన అధికారిక వస్త్రాన్ని+ తీసుకొని, యొర్దాను నది దగ్గరికి తిరిగొచ్చి ఒడ్డున నిలబడ్డాడు. 14  అతను ఏలీయా అధికారిక వస్త్రాన్ని తీసుకొని దానితో నీళ్లమీద కొట్టి, “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ?” అన్నాడు. అప్పుడు ఆ నది రెండుగా విడిపోయింది, ఎలీషా నది దాటాడు.+ 15  యెరికోలోని ప్రవక్తల కుమారులు దూరం నుండి అతన్ని చూసి, “ఏలీయాలోని పవిత్రశక్తి ఎలీషా మీద నిలిచింది”+ అన్నారు. వాళ్లు అతన్ని కలుసుకోవడానికి వచ్చి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. 16  వాళ్లు అతనితో, “ఇదిగో నీ సేవకుల దగ్గర సమర్థులైన 50 మంది మనుషులు ఉన్నారు. నీ యజమానిని వెదకడానికి దయచేసి వాళ్లను వెళ్లనివ్వు. బహుశా యెహోవా పవిత్రశక్తి* అతన్ని ఎత్తి, ఏదైనా ఒక పర్వతం మీద గానీ, లోయలో గానీ పడేసివుంటుంది”+ అన్నారు. అయితే అతను, “వాళ్లను పంపించొద్దు” అన్నాడు. 17  కానీ వాళ్లు పదేపదే అడుగుతూ అతన్ని ఇబ్బంది పెట్టడంతో అతను, “సరే, వాళ్లను పంపించండి” అన్నాడు. వాళ్లు ఆ 50 మందిని పంపించారు. వాళ్లు మూడు రోజులపాటు ఏలీయా కోసం వెదికారు కానీ అతను దొరకలేదు. 18  వాళ్లు తిరిగొచ్చినప్పుడు ఎలీషా యెరికోలో+ ఉన్నాడు. అతను, “వెళ్లొద్దని నేను మీకు చెప్పాను కదా?” అన్నాడు. 19  కొంతకాలం తర్వాత ఆ నగరంవాళ్లు ఎలీషాతో, “మా యజమాని అయిన నువ్వు చూస్తున్నట్టు ఈ నగరం సరైన స్థలంలో ఉంది;+ కానీ ఇక్కడి నీళ్లు మంచివి కావు, అందుకే భూమి ఫలించట్లేదు”* అన్నారు. 20  అప్పుడు అతను, “ఒక కొత్త చిన్న గిన్నెలో ఉప్పువేసి నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. వాళ్లు దాన్ని తీసుకొచ్చారు. 21  తర్వాత అతను నీళ్ల ఊట దగ్గరికి వెళ్లి అందులో ఉప్పువేసి+ ఇలా అన్నాడు: “యెహోవా ఏమి చెప్తున్నాడంటే, ‘నేను ఈ నీళ్లను బాగుచేశాను. ఇక నుండి ఈ నీళ్ల కారణంగా మరణించడం గానీ ఫలించకపోవడం* గానీ జరగదు.’ ” 22  ఎలీషా చెప్పినట్టే, ఆ నీళ్లు ఈ రోజు వరకు మంచిగా ఉన్నాయి. 23  ఎలీషా అక్కడి నుండి బేతేలుకు బయల్దేరాడు. దారిలో కొంతమంది చిన్న పిల్లలు నగరంలో నుండి బయటికి వచ్చి, “బట్టతలవాడా, ఇక్కడి నుండి వెళ్లిపో! బట్టతలవాడా, వెళ్లిపో!” అంటూ అతన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు.+ 24  చివరికి, అతను వెనక్కి తిరిగి వాళ్లను చూసి యెహోవా పేరున వాళ్లను శపించాడు. అప్పుడు అడవిలో నుండి రెండు ఆడ ఎలుగుబంట్లు+ వచ్చి ఆ పిల్లల్లో 42 మందిని ముక్కలుముక్కలుగా చీల్చేశాయి.+ 25  అతను అక్కడి నుండి కర్మెలు పర్వతానికి+ వెళ్లి, తర్వాత సమరయకు తిరిగొచ్చాడు.

అధస్సూచీలు

“ప్రవక్తల కుమారులు” అనే మాట బహుశా ప్రవక్తలకు ఉపదేశించే పాఠశాలను లేదా ప్రవక్తల సంఘాన్ని సూచిస్తుండవచ్చు.
లేదా “గాలి.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “గర్భస్రావాలు అవుతున్నాయి” అయ్యుంటుంది.
లేదా “గర్భస్రావాలు అవడం” అయ్యుంటుంది.