రాజులు రెండో గ్రంథం 24:1-20

  • యెహోయాకీము తిరుగుబాటు, మరణం (1-7)

  • యెహోయాకీను, యూదా రాజు (8, 9)

  • బబులోనుకు బందీలుగా తీసుకెళ్లిన మొదటి గుంపు (10-17)

  • సిద్కియా, యూదా రాజు; అతని తిరుగుబాటు (18-20)

24  యెహోయాకీము రోజుల్లో, బబులోను రాజైన నెబుకద్నెజరు+ యూదా మీదికి వచ్చాడు. యెహోయాకీము నెబుకద్నెజరుకు మూడు సంవత్సరాలు సేవచేసి, ఆ తర్వాత అతని మీద తిరుగుబాటు చేశాడు.  తర్వాత యెహోవా యెహోయాకీము మీదికి కల్దీయుల,+ సిరియన్ల, మోయాబీయుల, అమ్మోనీయుల దోపిడీ ముఠాల్ని పంపించడం మొదలుపెట్టాడు. యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా చెప్పిన మాట ప్రకారమే, యూదాను నాశనం చేయడానికి దాని మీదికి దోపిడీ ముఠాల్ని పంపిస్తూ వచ్చాడు.+  యెహోవా ఆజ్ఞ వల్లే యూదాకు అలా జరిగింది. ఆయన వాళ్లను తన ఎదుట నుండి తీసేయాలనుకున్నాడు.+ ఎందుకంటే మనష్షే ఎన్నో పాపాలు చేశాడు,  అతను అమాయకుల రక్తాన్ని చిందించి+ వాళ్ల రక్తంతో యెరూషలేమును నింపేశాడు; అందుకే యెహోవా యూదాను క్షమించడానికి ఇష్టపడలేదు.+  యెహోయాకీము మిగతా చరిత్ర, అంటే అతను చేసిన పనులన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాయబడివున్నాయి.  తర్వాత యెహోయాకీము చనిపోయాడు;*+ అతని స్థానంలో అతని కుమారుడు యెహోయాకీను రాజయ్యాడు.  బబులోను రాజు, ఐగుప్తు వాగు*+ మొదలుకొని యూఫ్రటీసు నది+ వరకున్న ఐగుప్తు రాజు ప్రాంతాలన్నిటినీ స్వాధీనం చేసుకోవడంతో+ ఐగుప్తు రాజు మళ్లీ ఎప్పుడూ తన సైన్యాన్ని బయటికి పంపించలేదు.  రాజైనప్పుడు యెహోయాకీను+ వయసు 18 ఏళ్లు. అతను యెరూషలేములో మూడు నెలలు పరిపాలించాడు. అతని తల్లి పేరు నెహుష్తా. ఆమె యెరూషలేముకు చెందిన ఎల్నాతాను కూతురు.  యెహోయాకీను తన తండ్రిలాగే యెహోవా దృష్టికి చెడు చేస్తూ వచ్చాడు. 10  ఆ సమయంలో బబులోను రాజైన నెబుకద్నెజరు సేవకులు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడించారు. 11  తన సేవకులు యెరూషలేమును ముట్టడిస్తున్నప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు అక్కడికి వచ్చాడు. 12  యూదా రాజైన యెహోయాకీను తన తల్లితో, సేవకులతో, అధిపతులతో, ఆస్థాన అధికారులతో పాటు+ బబులోను రాజుకు లొంగిపోయాడు;+ బబులోను రాజు తన పరిపాలనలోని ఎనిమిదో సంవత్సరంలో అతన్ని బందీగా తీసుకెళ్లాడు.+ 13  తర్వాత బబులోను రాజు యెహోవా మందిరంలో, రాజభవనంలో ఉన్న సంపదలన్నిటినీ తీసుకెళ్లిపోయాడు.+ ఇశ్రాయేలు రాజైన సొలొమోను చేయించిన యెహోవా మందిరంలోని బంగారు పాత్రలన్నిటినీ+ అతను ముక్కలుముక్కలు చేయించాడు. యెహోవా ముందే చెప్పినట్టు ఇదంతా జరిగింది. 14  అతను యెరూషలేము వాళ్లందర్నీ, అధిపతులందర్నీ,+ బలమైన యోధులందర్నీ, నైపుణ్యంగల పనివాళ్లందర్నీ, కమ్మరి వాళ్లందర్నీ* మొత్తం 10,000 మందిని బందీలుగా తీసుకెళ్లాడు.+ అతను నిరుపేదల్ని తప్ప దేశంలో ఎవర్నీ ఉండనివ్వలేదు.+ 15  అలా అతను యెహోయాకీనును బబులోనుకు బందీగా తీసుకెళ్లాడు;+ అతని తల్లిని, భార్యల్ని, ఆస్థాన అధికారుల్ని, దేశంలోని ప్రముఖుల్ని యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు. 16  అంతేకాదు బబులోను రాజు యెరూషలేములో ఉన్న 7,000 మంది యోధులందర్నీ, అలాగే 1,000 మంది నైపుణ్యంగల పనివాళ్లను, కమ్మరి వాళ్లను* బందీలుగా తీసుకెళ్లాడు. వాళ్లందరూ బలవంతులు, యుద్ధ నైపుణ్యం గలవాళ్లు. 17  బబులోను రాజు, యెహోయాకీను స్థానంలో అతని చిన్నాన్న మత్తన్యాను రాజుగా చేసి, అతని పేరును సిద్కియాగా+ మార్చాడు. 18  రాజైనప్పుడు సిద్కియా వయసు 21 ఏళ్లు, అతను యెరూషలేములో 11 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నాకు చెందిన యిర్మీయా కూతురు. 19  అతను యెహోయాకీములాగే యెహోవా దృష్టిలో చెడ్డపనులు చేస్తూ వచ్చాడు.+ 20  యెహోవా కోపం వల్లే యెరూషలేములో, యూదాలో ఇవన్నీ జరిగాయి, చివరికి ఆయన వాటిని తన ఎదుట నుండి వెళ్లగొట్టాడు. సిద్కియా బబులోను రాజుకు ఎదురుతిరిగాడు.+

అధస్సూచీలు

అక్ష., “తన పూర్వీకులతో నిద్రించాడు.”
పదకోశం చూడండి.
లేదా “రక్షణ గోడలు కట్టేవాళ్లందర్నీ” అయ్యుంటుంది.
లేదా “రక్షణ గోడలు కట్టేవాళ్లను” అయ్యుంటుంది.