సమూయేలు రెండో గ్రంథం 21:1-22
21 దావీదు రోజుల్లో వరుసగా మూడు సంవత్సరాలు కరువు వచ్చింది.+ కాబట్టి దావీదు యెహోవాను సంప్రదించాడు. అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు: “సౌలు గిబియోనీయుల్ని చంపించాడు, అందుకే సౌలుమీద, అతని ఇంటివాళ్లమీద రక్తాపరాధం ఉంది.”+
2 దాంతో రాజు గిబియోనీయుల్ని+ పిలిపించి వాళ్లతో మాట్లాడాడు. (నిజానికి, గిబియోనీయులు ఇశ్రాయేలీయులు కాదుగానీ అమోరీయుల్లో+ మిగిలినవాళ్లు. వాళ్లను చంపం అని ఇశ్రాయేలీయులు ప్రమాణం చేశారు.+ కానీ సౌలు ఇశ్రాయేలు, యూదా ప్రజల విషయంలో ఉన్న ఉత్సాహంతో వాళ్లను చంపాలని ప్రయత్నించాడు.)
3 దావీదు గిబియోనీయుల్ని, “మీరు యెహోవా ప్రజల్ని* ఆశీర్వదించాలంటే నేను మీ కోసం ఏమి చేయాలి? నేనెలా ప్రాయశ్చిత్తం చేయాలి?” అని అడిగాడు.
4 గిబియోనీయులు అతనితో, “సౌలు, అతని కుటుంబం మాకు చేసింది, బంగారంతో గానీ వెండితో గానీ ప్రాయశ్చిత్తం కాదు;+ అలాగని ఇశ్రాయేలులో మేము ఎవర్నీ చంపలేం” అన్నారు. దానికి దావీదు, “మీరు ఏమి చెప్పినాసరే, దాన్ని మీ కోసం చేస్తాను” అన్నాడు.
5 అప్పుడు వాళ్లు రాజుతో ఇలా అన్నారు: “ఎవరైతే మమ్మల్ని నిర్మూలించడానికి ప్రయత్నించి, ఇశ్రాయేలు ప్రాంతంలో ఎక్కడా జీవించకుండా మమ్మల్ని పూర్తిగా నాశనం చేయాలని కుట్ర పన్నారో+—
6 ఆ వ్యక్తి కుమారుల్లో ఏడుగుర్ని మాకు అప్పగించాలి. మేము వాళ్లను చంపి, వాళ్ల శవాల్ని యెహోవా రాజుగా ఎంచుకున్న సౌలుకు+ చెందిన గిబియాలో+ యెహోవా ఎదుట వేలాడదీస్తాం.”+ దానికి రాజు, “నేను వాళ్లను అప్పగిస్తాను” అన్నాడు.
7 అయితే, యెహోవా ఎదుట తాను, సౌలు కుమారుడైన యోనాతాను చేసుకున్న ప్రమాణాన్ని బట్టి+ సౌలు మనవడూ, యోనాతాను కుమారుడూ అయిన మెఫీబోషెతు మీద దావీదు రాజు కనికరం చూపించాడు.+
8 కాబట్టి అయ్యా కూతురైన రిస్పా+ సౌలుకు కన్న ఇద్దరు కుమారుల్ని, అంటే అర్మోనిని, మెఫీబోషెతును అలాగే సౌలు కూతురైన మీకాలు*+ మెహోలతీయుడైన బర్జిల్లయి కుమారుడు అద్రీయేలుకు+ కన్న ఐదుగురు కుమారుల్ని రాజు తీసుకొచ్చాడు.
9 తర్వాత దావీదు వాళ్లను గిబియోనీయులకు అప్పగించాడు. వాళ్లు యెహోవా ఎదుట పర్వతం మీద వాళ్ల శవాల్ని వేలాడదీశారు.+ ఆ ఏడుగురూ ఒకేసారి చనిపోయారు; వాళ్లు కోతకాలం ఆరంభ రోజుల్లో, అంటే బార్లీ కోత ఆరంభంలో చంపబడ్డారు.
10 అప్పుడు అయ్యా కూతురైన రిస్పా+ గోనెపట్ట తీసుకొని బండమీద పరిచింది. కోతకాలం ఆరంభం నుండి ఆకాశం నుండి వర్షం కురిసే వరకు ఆమె అలా చేసింది; ఆమె పగలు ఆకాశపక్షుల్ని ఆ శవాలమీద వాలనివ్వలేదు, అలాగే రాత్రుళ్లు క్రూరమృగాల్ని వాటి దగ్గరికి రానివ్వలేదు.
11 అయ్యా కూతురూ, సౌలు ఉపపత్నీ అయిన రిస్పా చేసినదాని గురించి దావీదుకు తెలిసింది.
12 దాంతో దావీదు వెళ్లి సౌలు ఎముకల్ని, అతని కుమారుడు యోనాతాను ఎముకల్ని యాబేష్గిలాదు నాయకుల*+ దగ్గర నుండి తెచ్చాడు. ఫిలిష్తీయులు గిల్బోవ మీద సౌలును చంపిన రోజున వాళ్ల శవాల్ని బేత్షాను నగర వీధిలో వేలాడదీశారు. యాబేష్గిలాదు నాయకులు అక్కడి నుండి వాళ్ల శవాల్ని ఎత్తుకెళ్లారు.+
13 దావీదు అక్కడి నుండి సౌలు ఎముకల్ని, సౌలు కుమారుడైన యోనాతాను ఎముకల్ని తీసుకొచ్చాడు. చంపబడిన* మనుషుల ఎముకల్ని కూడా వాళ్లు సమకూర్చారు.+
14 తర్వాత వాళ్లు సౌలు ఎముకల్ని, అతని కుమారుడైన యోనాతాను ఎముకల్ని బెన్యామీను ప్రాంతంలోని సేలాలో+ ఉన్న సౌలు తండ్రి కీషు+ సమాధిలో పాతిపెట్టారు. వాళ్లు రాజు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత, దేశం కోసం వాళ్లు చేసిన విన్నపాల్ని దేవుడు విన్నాడు.+
15 మళ్లీ ఫిలిష్తీయులకు, ఇశ్రాయేలీయులకు మధ్య యుద్ధం జరిగింది. దావీదు, అతని మనుషులు వెళ్లి ఫిలిష్తీయులతో యుద్ధం చేశారు. కానీ దావీదు అలసిపోయాడు.
16 రెఫాయీము+ వంశస్థుడైన ఇష్బిబేనోబ అనే వ్యక్తి దావీదును చంపాలనుకున్నాడు. అతని దగ్గరున్న రాగి ఈటె బరువు 300 షెకెల్‌లు.*+ అతను ధరించిన కత్తి కొత్తది.
17 వెంటనే సెరూయా కుమారుడైన అబీషై+ దావీదును ఆదుకోవడానికి వచ్చి+ ఫిలిష్తీయుడి మీద దాడిచేసి చంపేశాడు. అప్పుడు దావీదు మనుషులు దావీదుతో, “ఇశ్రాయేలు దీపం+ ఆరిపోకుండా ఉండేలా నువ్వు మాతో ఇంకెప్పుడూ యుద్ధానికి రాకూడదు!”+ అని ప్రమాణం చేశారు.
18 తర్వాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో మళ్లీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో హూషాతీయుడైన సిబ్బెకై+ రెఫాయీము వంశస్థుడైన సఫును చంపాడు.
19 ఆ తర్వాత గోబులో మరోసారి ఫిలిష్తీయులతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బేత్లెహేమువాసియైన యహరేయోరెగీము కుమారుడు ఎల్హానా గిత్తీయుడైన గొల్యాతును చంపాడు. గొల్యాతు ఈటెకు ఉన్న కర్ర, నేత నేసేవాళ్ల కర్రంత పెద్దది.+
20 గాతులో మళ్లీ యుద్ధం జరిగింది, అక్కడ చాలా ఎత్తుగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఒక్కో చేతికి, ఒక్కో పాదానికి ఆరేసి వేళ్ల చొప్పున మొత్తం 24 వేళ్లు ఉన్నాయి; అతను కూడా రెఫాయీము వంశస్థుడే.
21 అతను ఇశ్రాయేలీయుల్ని సవాలుచేస్తూ* ఉన్నాడు.+ అప్పుడు దావీదు సహోదరుడైన షిమీ+ కుమారుడు యోనాతాను అతన్ని చంపాడు.
22 ఈ నలుగురు గాతులో ఉన్న రెఫాయీము వంశస్థులు; వాళ్లు దావీదు చేతిలో, అతని సేవకుల చేతిలో చనిపోయారు.+
అధస్సూచీలు
^ అక్ష., “స్వాస్థ్యాన్ని.”
^ లేదా “మేరబు” అయ్యుంటుంది.
^ లేదా “జమీందారుల” అయ్యుంటుంది.
^ లేదా “వేలాడదీయబడిన.”
^ దాదాపు 3.42 కిలోలు. అనుబంధం B14 చూడండి.
^ లేదా “నిందిస్తూ; హేళనచేస్తూ.”