సమూయేలు రెండో గ్రంథం 8:1-18
8 కొంతకాలం తర్వాత దావీదు ఫిలిష్తీయుల్ని ఓడించి,+ వాళ్లను లోబర్చుకున్నాడు; అతను ఫిలిష్తీయుల చేతుల్లో నుండి మెతెగమ్మాను స్వాధీనం చేసుకున్నాడు.
2 అతను మోయాబీయుల్ని ఓడించాడు,+ వాళ్లను నేలమీద పడుకోబెట్టి తాడుతో కొలిచాడు. వాళ్లలో రెండు వంతుల మందిని చంపడానికి, ఒక వంతు మందిని బ్రతకనివ్వడానికి అతను అలా చేశాడు.+ ఆ విధంగా మోయాబీయులు దావీదుకు సేవకులై, అతనికి కప్పం కట్టారు.+
3 దావీదు సోబా రాజూ రెహోబు కుమారుడూ అయిన హదదెజరును ఓడించాడు.+ హదదెజరు యూఫ్రటీసు నది ప్రాంతాన్ని తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడు దావీదు అతన్ని ఓడించాడు.+
4 దావీదు అతని దగ్గర నుండి 1,700 గుర్రపురౌతుల్ని, 20,000 మంది సైనికుల్ని పట్టుకున్నాడు. తర్వాత, రథాల్ని లాగే 100 గుర్రాల్ని తప్ప మిగతా వాటన్నిటినీ దావీదు కుంటివాటిగా చేశాడు.+
5 దమస్కుకు చెందిన సిరియన్లు సోబా రాజైన హదదెజరుకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు, దావీదు 22,000 మంది సిరియన్లను చంపాడు.
6 తర్వాత దావీదు దమస్కుకు చెందిన సిరియాలో సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేశాడు, సిరియన్లు దావీదుకు సేవకులై అతనికి కప్పం కట్టారు. దావీదు వెళ్లిన చోటల్లా యెహోవా అతనికి విజయాన్ని* ఇచ్చాడు.+
7 అంతేకాదు, దావీదు హదదెజరు సేవకుల దగ్గర నుండి బంగారంతో చేసిన గుండ్రటి డాళ్లను తీసుకొని వాటిని యెరూషలేముకు తెచ్చాడు.
8 హదదెజరు నగరాలైన బెతహు నుండి, బేరోతై నుండి దావీదు రాజు పెద్ద మొత్తంలో రాగిని తీసుకొచ్చాడు.
9 దావీదు హదదెజరు సైన్యాన్నంతటినీ ఓడించాడని హమాతు రాజైన తోయి విన్నాడు.
10 అతను దావీదు బాగోగుల గురించి అడగడానికి, శుభాకాంక్షలు చెప్పడానికి తన కుమారుడైన యోరామును దావీదు రాజు దగ్గరికి పంపించాడు; దావీదు హదదెజరుతో పోరాడి, అతన్ని ఓడించాడు కాబట్టి తోయి అలా చేశాడు (ఎందుకంటే హదదెజరుకు, తోయికి మధ్య చాలా యుద్ధాలు జరిగాయి); యోరాము వెండి, బంగారు, రాగి వస్తువుల్ని తీసుకొని దావీదు దగ్గరికి వచ్చాడు.
11 దావీదు తాను ఓడించిన దేశాలన్నిటిలో నుండి తీసుకొచ్చిన వెండిబంగారాలతో పాటు వాటిని కూడా యెహోవాకు ప్రతిష్ఠించాడు.*+
12 దావీదు వాటిని సిరియా నుండి, మోయాబు నుండి, అలాగే అమ్మోనీయుల నుండి, ఫిలిష్తీయుల నుండి, అమాలేకీయుల+ నుండి, సోబా రాజూ రెహోబు కుమారుడూ అయిన హదదెజరు నుండి కొల్లగొట్టాడు.
13 అంతేకాదు, ఉప్పులోయలో 18,000 మంది ఎదోమీయుల్ని చంపి తిరిగొచ్చినప్పుడు దావీదుకు గొప్ప పేరు వచ్చింది.+
14 అతను ఎదోములో సైనిక స్థావరాల్ని స్థాపించాడు. ఎదోము అంతటా అలా స్థాపించాడు, ఎదోమీయులందరూ అతనికి సేవకులయ్యారు.+ దావీదు వెళ్లిన చోటల్లా యెహోవా అతనికి విజయాన్ని* ఇచ్చాడు.+
15 దావీదు ఇశ్రాయేలు అంతటిమీద పరిపాలిస్తూ+ తన ప్రజలందరికీ నీతిన్యాయాలు+ జరిగిస్తూ ఉన్నాడు.+
16 సెరూయా కుమారుడైన యోవాబు+ సైన్యాధిపతిగా, అహీలూదు కుమారుడైన యెహోషాపాతు+ వివరాలు నమోదు చేసేవాడిగా ఉన్నాడు.
17 అహీటూబు కుమారుడైన సాదోకు,+ అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులుగా, శెరాయా కార్యదర్శిగా ఉన్నారు.
18 యెహోయాదా కుమారుడైన బెనాయా+ కెరేతీయుల మీద, పెలేతీయుల+ మీద అధికారిగా ఉన్నాడు. దావీదు కుమారులు ముఖ్య అధికారులు* అయ్యారు.