ఇతరులకు చేయి అందిస్తూ ఒంటరితనాన్ని తరిమికొట్టండి—బైబిలు ఏం చెప్తుంది?
నేడు ప్రపంచంలో అన్నిచోట్లా ప్రజలు ఒంటరితనంతో బాధపడుతున్నారు, అందరికీ దూరమైనట్టు ఫీల్ అవుతున్నారు. ఇతరులకు సాయం చేస్తే, అలాంటి ఫీలింగ్స్ నుండి బయటపడవచ్చు అని కొంతమంది హెల్త్ ఆఫీసర్స్ చెప్తున్నారు.
“అవసరంలో ఉన్నవాళ్లను ఆదుకుంటే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అలాంటి మంచి మనసు ఒంటరితనాన్ని దూరం చేస్తుంది.”—యు.ఎస్. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్.
ఇతరులకు చేయూతను ఇవ్వడానికి ఉపయోగపడే చక్కని సలహాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని పాటిస్తే ఒంటరితనాన్ని తరిమికొట్టవచ్చు.
మీరేం చేయవచ్చు?
ఇచ్చే గుణం చూపించండి. ఇతరులతో టైం గడపండి, ముఖ్యంగా నేరుగా కలిసే అవకాశాల కోసం చూడండి. మీకున్న వాటిని ఇష్టంగా పంచుకోండి. అలాచేస్తే వాళ్ల మనసులో మీకంటూ ఒక చోటు సంపాదించుకుంటారు. దానివల్ల మీ స్నేహం చిరకాలం ఉంటుంది.
బైబిలు సలహా: “ఇవ్వడం అలవాటు చేసుకోండి, అప్పుడు ప్రజలు మీకు ఇస్తారు.”—లూకా 6:38.
చేదోడువాదోడుగా ఉండండి. కష్టాల్లో ఉన్నవాళ్లకు ఎలా సాయం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. వాళ్ల మనసులో ఉన్నది చెప్తున్నప్పుడు ఓపిగ్గా వినండి, వాళ్ల కోసం చిన్నచిన్న పనులు చేసి పెట్టండి.
బైబిలు సలహా: “నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు.”—సామెతలు 17:17.
ఇతరులతో మంచి స్నేహాల్ని-బంధాల్ని పెంచుకోవడానికి ఇంకా ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, “కుటుంబ జీవితం, స్నేహం” అనే ఆర్టికల్ చూడండి.