అప్రమత్తంగా ఉండండి!
మంచి-మర్యాదలు ఇంకా బ్రతికే ఉన్నాయా?—బైబిలు ఏం చెప్తుంది?
మంచి-మర్యాదలు మంచం పట్టాయి. కొంతమంది పేషెంట్లు మొరటుగా డాక్టర్ల మీద నోరు పారేసుకుంటున్నారు; మర్యాదలేని కస్టమర్లు వెయిటర్ల మీద అరుస్తున్నారు; సహనంలేని పాసెంజర్లు ఫ్లైట్ సిబ్బందితో కొట్లాటకు దిగుతున్నారు; పోకిరి పిల్లలు టీచర్లను ఆడుకుంటున్నారు, బెదిరిస్తున్నారు, వాళ్లమీద చెయ్యి చేసుకుంటున్నారు; కొంతమంది రాజకీయ నాయకులు మంచి-మర్యాదల గురించి డప్పు కొట్టుకుంటుంటే, ఇంకొంతమంది నాయకులేమో వాటిని గాలికి వదిలేసి పరువు తీస్తున్నారు.
బైబిలు నిజమైన మంచి-మర్యాదలు నేర్పడమే కాదు, అవి ఈరోజుల్లో ఎందుకు కరువయ్యాయో కూడా చెప్తుంది.
మంచి-మర్యాదలు ఇంకా బ్రతికే ఉన్నాయా?
మంచి-మర్యాదలు అంటే పద్ధతిగా, సభ్యతగా, సంస్కారంతో మెలగడం. అవే ఈ రోజుల్లో కరువయ్యాయి.
ఈమధ్య జరిపిన సర్వే ప్రకారం, యునైటెడ్ స్టేట్స్లో గత 22 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు నైతిక విలువలు అడుగంటిపోయాయి అని అమెరికన్లు చెప్తున్నారు.
28 దేశాల్లో 32,000 కన్నా ఎక్కువమంది మీద సర్వే చేస్తే, అందులో 65 శాతం మంది, కనీస మర్యాదలు కూడా తెలియకుండా మనుషులు ఇంతకు దిగజారడం ఎప్పుడూ చూడలేదు అన్నారు.
ఇలాంటి ప్రవర్తన గురించి బైబిలు ముందే చెప్పింది.
‘చివరి రోజుల్లో కష్టమైన కాలాలు వస్తాయి. ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: స్వార్థపరులు, డబ్బును ప్రేమించేవాళ్లు, గొప్పలు చెప్పుకునేవాళ్లు, గర్విష్ఠులు, దూషించేవాళ్లు, తల్లిదండ్రులకు లోబడనివాళ్లు, కృతజ్ఞత లేనివాళ్లు, ఆత్మనిగ్రహం లేనివాళ్లు, క్రూరులు.’—2 తిమోతి 3:1-3, అధస్సూచి.
ఆ మాటలు ఇప్పుడు ఎలా నెరవేరుతున్నాయో తెలుసుకోవాలనుకుంటే, “ఈ లోకం తీరు గురించి బైబిలు ముందే చెప్పిందా?” అనే ఆర్టికల్ చదవండి.
మంచి-మర్యాదలు నేర్పే ఒక మంచి పుస్తకం
మంచి-మర్యాదలు అటకెక్కిన ఈ లోకంలో, బైబిలు మంచిని నేర్పించే ఒక చక్కని పుస్తకమని లక్షలమంది తెలుసుకున్నారు. అందులోని సలహాలు “ఇప్పుడూ, ఎప్పుడూ … ఆధారపడదగినవి.” (కీర్తన 111:8) కొన్ని ఉదాహరణలు చూడండి:
బైబిలు ఏం చెప్తుంది: “ఇతరులు మీతో ఎలా వ్యవహరించాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లతో అలాగే వ్యవహరించండి.”—మత్తయి 7:12.
అంటే: వేరేవాళ్లు మనతో దయగా, మర్యాదగా ఉండాలని మనం కోరుకున్నట్టే మనమూ వాళ్లతో అలాగే ఉండాలి.
బైబిలు ఏం చెప్తుంది: “మోసం చేయడం మానేసిన మీరు సాటిమనిషితో నిజమే మాట్లాడండి.”—ఎఫెసీయులు 4:25.
అంటే: మనం ఏం చెప్పినా, ఏది చేసినా అందులో నిజాయితీ ఉండాలి.
ఈ విషయం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, దయచేసి ఇవి చదవండి:
“ఏది తప్పు? ఏది ఒప్పు?—సరైన దారి తెలుసుకునేదెలా?” అనే కావలికోట పత్రిక.
“వేరేవాళ్ల నమ్మకాల్ని, అభిప్రాయాల్ని గౌరవించడం—బైబిలు ఇచ్చే సలహా” అనే ఆర్టికల్.