స్త్రీల భద్రత—బైబిలు ఏం చెప్తుంది?
ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది స్త్రీల మీద, ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. మీకు కూడా అలా ఎప్పుడైనా జరిగిందా? అయితే గుర్తుంచుకోండి మీరు సురక్షితంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? స్త్రీలపై దాడులు జరగకుండా ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలని ఉందా?
“నా చిన్నప్పుడు మా అన్నయ్య నన్ను మాటలతో, పనులతో హింసించని రోజంటూ లేదు. పెళ్లి అయ్యాక మా అత్తగారు కూడా అలాగే వేధించింది. ఆమె, మా మామగారు నన్ను బానిసలా చూసేవాళ్లు. నాకు చనిపోవాలని చాలాసార్లు అనిపించింది.”—మధు, a ఇండియా.
“స్త్రీల మీద దాడులు అన్నిచోట్లా సర్వసాధారణం అయిపోయాయి”అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్తుంది. ప్రతీ ముగ్గురి స్త్రీలలో ఒకరు, వాళ్ల జీవితంలో ఏదోక సందర్భంలో శారీరక లేదా లైంగిక దాడికి గురౌతున్నారని ఆ సంస్థ అంచనా వేసింది.
ఒకవేళ మీకు అలా జరిగి ఉంటే, ఎవరో ఒకరు మిమ్మల్ని మాటలతో చిత్రవధ చేస్తారేమో, మీపై దౌర్జన్యం చేస్తారేమో, లైంగిక దాడి చేస్తారేమో అనే భయం మిమ్మల్ని అనుక్షణం వెంటాడుతుండవచ్చు. ఆడవాళ్ల మీద జరుగుతున్న అలాంటి దాడులు, అన్యాయాలు, అక్రమాలు చూసినప్పుడు, ఆడవాళ్లంటే అసలు ఎవ్వరికీ లెక్కేలేదని మీకు అనిపించవచ్చు. మరి దేవుడు ఆడవాళ్లను ఎలా చూస్తున్నాడు?
దేవుడు ఆడవాళ్లను ఎలా చూస్తున్నాడు?
బైబిల్లో ఇలా ఉంది: ‘దేవుడు పురుషునిగా, స్త్రీగా వాళ్లను సృష్టించాడు.’—ఆదికాండం 1:27.
అంటే: స్త్రీ-పురుషులు ఇద్దరినీ దేవుడే సృష్టించాడు. ఆయన దృష్టిలో వాళ్లిద్దరూ గౌరవం పొందడానికి అర్హులు. ఇంకా చెప్పాలంటే, భర్త “తనను తాను ప్రేమించుకున్నట్టు తన భార్యను ప్రేమించాలి” అని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగానీ, భార్యను చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి ప్రయత్నించడం, ఆమెను సూటిపోటి మాటలతో హింసించడం, కొట్టడం చేస్తే దేవునికి ఇష్టం ఉండదు. (ఎఫెసీయులు 5:33; కొలొస్సయులు 3:19) దీన్నిబట్టి, ఆడవాళ్ల భద్రత గురించి దేవుడు పట్టించుకుంటున్నాడని అర్థమౌతుంది.
“నా చిన్నప్పుడు మా బంధువులు నన్ను లైంగికంగా వేధించారు. నాకు 17ఏళ్లు ఉన్నప్పుడు, మా బాస్ తనతో సెక్స్ చేయకపోతే నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తానని బెదిరించాడు. నేను పెద్దయ్యాక మా అమ్మానాన్నలు, నా భర్త, చుట్టుపక్కలవాళ్లు నన్ను చిన్నచూపు చూసేవాళ్లు. కొంతకాలానికి నేను సృష్టికర్త అయిన యెహోవా b గురించి తెలుసుకున్నాను. ఆయన ఆడవాళ్లను గౌరవిస్తాడనే విషయం తెలుసుకున్నాక, ‘ఆయనకు నేనంటే ఇష్టం, ఆయన నాకు విలువిస్తాడు’ అనే నమ్మకం నాలో కలిగింది.”—మరియ, అర్జెంటీనా.
మీ మనసుకు తగిలిన గాయాలు నయం అవ్వడానికి ఏం చేయవచ్చు?
బైబిల్లోని మాట: “సహోదరుడి కన్నా ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు కూడా ఉన్నాడు.”—సామెతలు 18:24.
అంటే: నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటాడు. మీ మనసుకు ప్రశాంతంగా ఉంటుందనిపిస్తే, మీరు బాగా నమ్మే వ్యక్తికి మీ ఫీలింగ్స్ చెప్పుకోండి.
“నా మీద లైంగిక దాడి జరిగిందనే విషయాన్ని 20ఏళ్లు నాలోనే దాచుకున్నాను. దానివల్ల నేనెప్పుడూ ఆందోళనగా, నిరుత్సాహంగా, భయంభయంగా ఉండేదాన్ని. అయితే, చివరికి ఒకరోజు నేను బాగా నమ్మిన వ్యక్తికి, నా మనసులో దాచుకున్నదంతా చెప్పుకున్నప్పుడు నా గుండెల మీదినుండి పెద్ద భారం దిగిపోయినట్టుగా అనిపించింది.”—ఇలిఫ్, తుర్కియే.
బైబిల్లోని మాట: “ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి.”—1 పేతురు 5:7.
అంటే: మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. (కీర్తన 55:22; 65:2) ఎందుకంటే ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది, మీరు నిజంగా ఎంత విలువైనవాళ్లో అర్థం చేసుకునేలా మీకు సహాయం చేస్తాడు.
“యెహోవా గురించి నేర్చుకోవడం, నా మనసుకు తగిలిన లోతైన గాయాల్ని నయం చేసింది. నా మనసులో ఉన్నదంతా ఇప్పుడు ప్రార్థనలో దేవునికి చెప్పుకోగలుగుతున్నాను. ఆయన నా ఫీలింగ్స్‌ని నిజంగా అర్థం చేసుకునే ఒక ఫ్రెండ్.”—ఆనా, బెలీజ్.
ఆడవాళ్లకు జరిగే అన్యాయాన్ని దేవుడు ఎప్పటికైనా ఆపుతాడా?
బైబిల్లోని మాట: “యెహోవా, నువ్వు . . . తండ్రిలేనివాళ్లకు, నలిగినవాళ్లకు న్యాయం తీరుస్తావు, అప్పుడు మనిషి వాళ్లను ఇక భయపెట్టడు.”—కీర్తన 10:17, 18.
అంటే: ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని, అరాచకాల్ని దేవుడు త్వరలోనే తీసేస్తాడు.
“ఆడవాళ్ల మీద, ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాన్ని, యెహోవా త్వరలోనే తీసేస్తాడని తెలుసుకున్నప్పుడు నా మనసుకు ఎంతో హాయిగా, మనశ్శాంతిగా అనిపించింది.”—రోబెర్టా, మెక్సికో.
బైబిలు మనలో ఎలా ఆశను నింపుతుందో, అందులోని మాటల్ని ఎందుకు నమ్మవచ్చో, యెహోవాసాక్షులు బైబిలు ద్వారా మీకు ఎలా సహాయం చేస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, మిమ్మల్ని కలవడానికి రిక్వెస్టు చేయండి. దానికోసం వాళ్లు మీ దగ్గర డబ్బులు తీసుకోరు.
దీన్ని మీరు ప్రింట్ తీసుకోవడానికి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు.
a ఇవి అసలు పేర్లు కావు.
b దేవుని పేరు యెహోవా. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?”అనే ఆర్టికల్ చూడండి