నవంబరు 1, 2023
ఇండియా
ఇండియాలోని సమావేశంలో జరిగిన పేలుళ్ల తర్వాత సాక్షులు ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు
jw.org వెబ్‌సైట్‌లో బ్రేకింగ్ న్యూస్‌లో వచ్చినట్టు, ఆదివారం రోజున అంటే 2023 అక్టోబరు 29న, ఇండియాలోని కేరళలో ప్రాదేశిక సమావేశం జరుగుతున్నప్పుడు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అందులో ఇద్దరు సిస్టర్స్ చనిపోయారని మనం ఇప్పటికే విన్నాం. మరో బాధాకరమైన విషయం ఏంటంటే 12 ఏళ్లున్న ఒక చిన్నపాప కూడా తనకు అయిన గాయాల వల్ల చనిపోయింది. మరో 55 మంది బ్రదర్స్-సిస్టర్స్ గాయాల పాలయ్యారు. వాళ్లలో కొంతమంది శరీరం బాగా కాలిపోయింది.
ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్న ముగ్గురు సిస్టర్స్, అలాగే ఇద్దరు బ్రదర్స్ పరిస్థితి కాస్త తీవ్రంగా ఉంది. ఉదయం ప్రారంభ ప్రార్థన జరిగే సమయానికి, అంటే సుమారు 9:40 నిమిషాలకు కనీసం మూడు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయని అధికారులు నిర్ధారించారు. ఈ ఘోరమైన సంఘటనకు కారణమని అనుకుంటున్న నిందితుడు ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు, దర్యాప్తు జరుగుతోంది.
ఘటనా స్థలానికి వెంటనే వచ్చిన సహాయక సిబ్బందికి, అలాగే గాయపడిన వాళ్లను శ్రద్ధగా చూసుకుంటున్న హాస్పిటల్ సిబ్బందికి మా కృతజ్ఞతలు.
తోటి విశ్వాసులు చూపించిన ప్రేమ, చేసిన సహాయం అక్కడ హాజరైనవాళ్లకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. పేలుళ్లు జరిగినప్పుడు హాల్లోనే ఉన్న ఒక సిస్టర్ ఇలా చెప్తోంది: “నేను వెంటనే యెహోవాకు ప్రార్థించడం మొదలుపెట్టాను. అటెండెంట్లు, అలాగే వేరే బ్రదర్స్ మాకు అండగా నిలబడ్డారు, మేమంతా సురక్షితంగా బయటపడడానికి వెంటనే చర్యలు తీసుకున్నారు. యెహోవాకు మాలో ప్రతీఒక్కరి మీదున్న ప్రేమను, శ్రద్ధను ఆ రోజు మేము సహోదరుల ద్వారా రుచిచూశాం.”
ఇండియాలోని బ్రాంచి ఆఫీస్ ప్రతినిధులు, ప్రాంతీయ పర్యవేక్షకులు, స్థానిక పెద్దలు అక్కడున్న వాళ్లకు అవసరమైన సహాయం చేస్తున్నారు; అలాగే ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నారు. అక్కడి బ్రదర్స్-సిస్టర్స్‌ని ఓదార్చడానికి బ్రాంచి ఆఫీస్ నుండి కేరళకు వెళ్లిన ఒక పెద్ద ఇలా అంటున్నాడు: “గాయపడినవాళ్లలో చాలామందితో నేను మాట్లాడాను. వాళ్లు ఎంతో బాధకి, షాక్‌కి గురైనా ధైర్యం కోల్పోలేదు. మన బ్రదర్స్-సిస్టర్స్ యెహోవా మీద ఆధారపడడం చూసి నా విశ్వాసం బలపడింది.”
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదర సహోదరీలు, ఇండియాలో జరిగిన ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినవాళ్ల కుటుంబాల కోసం, గాయపడిన వాళ్ల కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. హింసలు, బాధలు అలాగే మరణంలేని రోజులు రాబోతున్నాయని బైబిలు మాటిస్తోంది. అది మనకు ఎంతో ఓదార్పును, మనశ్శాంతిని ఇస్తుంది. ఇక ముందు కూడా యెహోవా మీద పూర్తి నమ్మకాన్ని ఉంచాలని మేము గట్టిగా తీర్మానించుకున్నాం.—కీర్తన 56:3.