నవంబరు 11, 2014
ఇండియా
గత 30 ఏళ్లుగా ఇండియాలో వాక్-స్వాతంత్ర్యాన్ని కాపాడుతూ వస్తున్న ఒక చారిత్రక సుప్రీం కోర్టు కేసు
1985, జూలై 8న కేరళలోని ఒక చిన్న ఊరిలో, ముగ్గురు పిల్లలు యథావిధిగా స్కూల్‌కి వెళ్లారు. ఆ రోజు స్కూల్లో వాళ్ల ప్రిన్సిపల్ జాతీయ గీతమైన “జనగణమన” పాడమని క్లాస్‌లో పిల్లలందరికీ చెప్పారు. అప్పుడు పిల్లలందరూ నిలబడి పాడారు. కానీ 15 ఏళ్ల బిజో అలాగే అతని చెల్లెళ్లు బిను మోల్ (13 ఏళ్లు), బిందు (10 ఏళ్లు) మాత్రం పాడలేదు, ఎందుకంటే యెహోవాసాక్షులుగా వాళ్ల మనస్సాక్షి దానికి ఒప్పుకోలేదు. అలా పాడితే, వాళ్లు విగ్రహారాధన చేసినట్టు అవుతుందని, వాళ్ల దేవుడైన యెహోవాకి నమ్మకంగా లేనట్టు అవుతుందని వాళ్లకు అనిపించింది.
ఆ పిల్లల నాన్నగారు వి. జె. ఇమ్మానుయెల్ ప్రిన్సిపల్‌తో, సీనియర్ టీచర్లతో మాట్లాడారు. పిల్లలు పాడకపోయినా ఫర్వాలేదని వాళ్లు చెప్పారు. కానీ వీళ్ల మాటల్ని ఆ స్కూల్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి విని రిపోర్టు చేశాడు. అది కాస్త ఒక శాసనసభ సభ్యుడి (M.L.A) చెవిన పడింది. ఆయన ఈ విషయాన్ని శాసనసభలో తీసుకొచ్చి, ఆ పిల్లలు దేశభక్తి చూపించట్లేదని ఆరోపించారు. కొన్ని రోజుల తర్వాత, పిల్లలు జాతీయ గీతాన్ని పాడకపోతే వాళ్లని స్కూల్లో నుండి తీసేయమని సీనియర్ స్కూల్ ఇన్‌స్పెక్టర్, ప్రిన్సిపల్‌కి ఆదేశించారు. వి. జె. ఇమ్మానుయెల్ తన పిల్లల్ని తిరిగి చేర్చుకోమని స్కూల్ అధికారుల్ని చాలాసార్లు బ్రతిమాలాడు, కానీ వాళ్లు ఒప్పుకోలేదు. అందుకే ఆయన కేరళ హైకోర్టులో ఒక పిటిషన్‌ని దాఖలు చేశాడు. ఆ కోర్టు కూడా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేసరికి ఆయన భారతదేశ సుప్రీం కోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు.
రాజ్యాంగ హక్కుల్ని సుప్రీం కోర్టు కాపాడింది
1986, ఆగస్టు 11న బిజో ఇమ్మానుయెల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో, సుప్రీం కోర్టు అంతకుముందు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది. ‘తమ మనస్సాక్షి ప్రకారం విశ్వసిస్తున్న మతనమ్మకాల’ కారణంగా, పిల్లల్ని స్కూల్లో నుండి తీసివేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధం అని కోర్టు చెప్పింది. జస్టిస్ ఓ. చిన్నప్ప రెడ్డి ఇలా అన్నారు: ‘చట్ట నిబంధనలేవీ ... ఎవ్వరిని కూడా పాడాలని బలవంతం చేయట్లేదు.’ మౌనంగా ఉండే హక్కు కూడా వాక్-స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛా హక్కుల్లో భాగమేనని, అలాగే జాతీయ గీతాన్ని పాడేటప్పుడు నిలబడి ఉండడం కూడా తగిన గౌరవం చూపించినట్టే అని కోర్టు చెప్పింది. పిల్లల్ని తిరిగి స్కూల్లో చేర్చుకోవాల్సిందిగా కోర్టు స్కూల్ అధికారులను ఆదేశించింది.
జస్టిస్ రెడ్డి ఇంకా ఇలా అన్నారు: ‘వాళ్లు [యెహోవాసాక్షులు] ఏ జాతీయ గీతాన్నైనా పాడరు, అది భారతదేశంలో “జనగణమన” అయినా, బ్రిటన్‌లో “గాడ్ సేవ్ ది క్వీన్” అయినా, అమెరికాలో “ది స్టార్ స్పాంగిల్డ్ బ్యానర్” అయినా, ఇలా ఏ దేశ గీతాన్నైనా పాడరు ... తమ దేవుడైన యెహోవాకు చేసే ప్రార్థనల్లో తప్ప, వేరే ఏ ఆచారాల్లో పాల్గొనకూడదని వాళ్ల మతం చెప్తుంది. వాళ్లు ఆ విషయాన్ని గట్టిగా నమ్ముతారు. జాతీయ గీతాన్ని పాడకపోవడానికి అదొక్కటే కారణం.’
మత సంబంధ హక్కుల విషయంలో ఈ కేసు ఒక చట్టపరమైన ప్రమాణాన్ని ఏర్పర్చింది
బిజో ఇమ్మానుయెల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే తమ మనస్సాక్షి ప్రకారం విశ్వసిస్తున్న మతనమ్మకాలకు విరుద్ధంగా ఎవ్వరినీ చట్టపరంగా బలవంతం చేయలేమని అది ఎత్తిచెప్పింది. ప్రాథమిక హక్కులకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయనీ, ఆ హక్కులు ప్రజల సంక్షేమానికి, నైతికతకు భంగం కలిగించని విధంగా ఉండాలనీ కోర్టు గుర్తించింది. అలాగే ఒక రాష్ట్రానికి, దాని పౌరుల మీద ఇష్టమొచ్చినట్టు, పొంతనలేని నియమ నిబంధనల్ని పెట్టే సంపూర్ణ అధికారం ఒక రాష్ట్రానికి లేదని కోర్టు తేల్చేసింది. ఆ తీర్పు ప్రకారం: ‘ఒక విద్యార్థి తన మనస్సాక్షిని బట్టి బలంగా విశ్వసిస్తున్న మతనమ్మకానికి వ్యతిరేకంగా, జాతీయ గీతాన్ని ఖచ్చితంగా పాడాల్సిందే అని ఎవరైనా బలవంతపెడితే, అది [భారత రాజ్యాంగంలో] ఆర్టికల్ 19(1)(ఎ) అలాగే ఆర్టికల్ 25(1) ఇస్తున్న హక్కులను ఉల్లంఘించినట్టు అవుతుంది.’
ఈ తీర్పు మైనారిటీ వర్గాలవాళ్లకు, రాజ్యాంగం ఇస్తున్న స్వేచ్ఛల్ని కూడా కాపాడుతుంది. కోర్టు ఇంకా ఇలా చెప్పింది: ‘అతి చిన్న మైనారిటీ వర్గాల వాళ్లను కూడా గుర్తించే సామర్థ్యం ఒక దేశపు రాజ్యాంగానికి ఉందంటే, ఆ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్టే.’ జస్టిస్ రెడ్డి ఇంకా ఇలా అన్నారు: ‘మన సొంత అభిప్రాయాలు, భావాలు అంత ముఖ్యం కాదు. ఎవరైనా నిజాయితీగా, మనస్సాక్షి ప్రకారం ఒక నమ్మకాన్ని పాటిస్తున్నారంటే, వాళ్లకు [రాజ్యాంగంలోని] ఆర్టికల్ 25 కింద సంరక్షణ కల్పించాలి.’
‘మన సాంప్రదాయం సహనాన్ని నేర్పిస్తోంది; మన సిద్ధాంతాలు సహనాన్ని బోధిస్తున్నాయి; మన రాజ్యాంగం సహనాన్ని పాటిస్తోంది; కాబట్టి దాన్ని నీరుగార్చకుండా ఉందాం.’—జస్టిస్ ఓ. చిన్నప్ప రెడ్డి
సమాజంపై ఈ తీర్పు చూపించిన ప్రభావం
బిజో ఇమ్మానుయెల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు గురించి మీడియాలో చాలా ఎక్కువగా మాట్లాడుకున్నారు. అలాగే దాని గురించి పార్లమెంట్‌లో కూడా చాలా చర్చలు జరిగాయి. న్యాయశాస్త్ర కాలేజీల్లో రాజ్యాంగ చట్టాల గురించి చెప్పేటప్పుడు విద్యార్థులకు ఈ తీర్పు గురించి కూడా నేర్పిస్తారు. ఇప్పటికీ న్యాయశాస్త్రానికి సంబంధించిన ఎన్నో మ్యాగజైన్స్‌లో, న్యూస్ ఆర్టికల్స్‌లో దీన్ని ఒక సంచలనం సృష్టించిన కేసు అని, భారతదేశంలో సహనస్ఫూర్తికి అద్దంపట్టిన కేసు అని ప్రస్తావిస్తుంటారు. విభిన్నమైన జాతులు, సంస్కృతులు ఉన్న సమాజంలో మత స్వేచ్ఛ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఈ కోర్టు తీర్పు సహాయం చేసింది. భారతదేశంలో ఎవరైనా ఎప్పుడైనా వాక్-స్వాతంత్ర్యానికి అలాగే భావవ్యక్తీకరణ స్వేచ్ఛకి భంగం కలిగించే పరిస్థితుల్ని ఎదుర్కొంటే, ఈ కేసు తీర్పు వాళ్లకు రక్షణ కల్పిస్తుంది.
రాజ్యాంగ హక్కుల్ని సంరక్షించడం అందరికీ ప్రయోజనమే
ఈ కేసు నడుస్తున్న సమయంలో ఇమ్మానుయెల్ కుటుంబం ఎన్నో అవమానాల్ని, అధికారుల నుండి ఒత్తిడిని, ఇంకా చంపేస్తామన్న బెదిరింపుల్ని కూడా ఎదుర్కొన్నారు. కానీ వాళ్లు తమ మత నమ్మకాలకు అంటిపెట్టుకొని ఉన్నందుకు ఏమాత్రం బాధపడట్లేదు. ఆ పిల్లల్లో ఒకరైన బిందుకి ఇప్పుడు పెళ్లైంది, ఆమె ఒక తల్లి కూడా. ఆమె ఇలా చెప్తుంది: ‘న్యాయశాస్త్రంలో భాగంగా మా కేసుని అధ్యయనం చేసిన ఒక లాయర్‌ని కలిసినప్పుడు నేనెంతో ఆశ్చర్యపోయాను. మానవ హక్కుల్ని స్థాపించడానికి యెహోవాసాక్షులు కోర్టులో చాలా గొప్పగా పోరాడారని ఆయన మెచ్చుకున్నాడు.’
వి. జె. ఇమ్మానుయెల్ ఇలా గుర్తుచేసుకున్నాడు: ‘ఈ మధ్యే నేను సుప్రీం కోర్టుకి జడ్జిగా రిటైర్ అయిన జస్టిస్ కె. టి. థామస్‌ని కలిశాను. జాతీయ గీతం కేసులో ఉన్న ఆ ముగ్గురి పిల్లల తండ్రిని నేనే అని తెలుసుకుని ఆయన నన్ను అభినందించారు. లాయర్ల మీటింగ్స్‌లో తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా, ఈ జాతీయ గీతం కేసు గురించి ప్రస్తావిస్తానని చెప్పారు. ఎందుకంటే మానవ హక్కుల విషయంలో ఈ కేసు ఒక ఘనమైన విజయాన్ని సాధించిందని అన్నారు.’
బిజో ఇమ్మానుయెల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో తీర్పు వచ్చి 30 సంవత్సరాలు దాటిపోయాయి. ఇప్పటికీ భారతదేశంలో వాక్-స్వాతంత్ర్యానికి సంబంధించి ఈ తీర్పు ఒక మూలస్తంభంగా ఉంది. రాజ్యాంగం కల్పించే స్వేచ్ఛల్ని భారతదేశ పౌరులందరికీ అందించే విషయంలో యెహోవాసాక్షులు తమ వంతుగా చేయగలిగింది చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నారు.