కంటెంట్‌కు వెళ్లు

ఫ్రాంజ్‌ అలాగే హిల్డా కుసెరో తమ 11 మంది పిల్లల వెనక నిలబడి ఉన్నారు. తమ నమ్మకాల కారణంగా నాజీల చేతుల్లో చంపబడిన వాళ్ల ఇద్దరు అబ్బాయిలు విల్‌హెల్మ్‌ అలాగే వుల్ఫ్‌గ్యాంగ్‌ (ఎడమ వైపు నుండి రెండవ అబ్బాయి అలాగే ఏడవ అబ్బాయి) చనిపోకముందు దిగిన ఫోటో

జనవరి 25, 2022
జర్మనీ

కుసెరో కుటుంబానికి సంబంధించిన డాక్యుమెంట్లను సంపాదించడానికి ప్రయత్నిస్తున్న యెహోవాసాక్షులు

కుసెరో కుటుంబానికి సంబంధించిన డాక్యుమెంట్లను సంపాదించడానికి ప్రయత్నిస్తున్న యెహోవాసాక్షులు

ఈ రోజు ద న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికలో చెప్పినట్టు, Jehovas Zeugen in Deutschland a అంటే జర్మనీలో ఉన్న యెహోవాసాక్షుల సంస్థ డ్రెస్‌డన్‌లోని బుండేస్వేర్‌ మిలిటరీ హిస్టరీ మ్యూజియం అధీనంలో ఉన్న కుసెరో కుటుంబానికి సంబంధించిన డాక్యుమెంట్లను సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. నిజానికి ఆ డాక్యుమెంట్లను పొందే చట్టపరమైన హక్కు జర్మనీలో ఉన్న యెహోవాసాక్షుల సంస్థకే ఉంది. మరిముఖ్యంగా ఆ డాక్యుమెంట్లను సంపాదిస్తే కుసెరో కుటుంబానికి జరిగిన ఘోరమైన అన్యాయం సరిచేయబడుతుంది.

వాళ్లు యెహోవాసాక్షులనే ఒకేఒక్క కారణంతో కుసెరో కుటుంబానికి చెందిన 13 మందిని నాజీ ప్రభుత్వం కఠినంగా హింసించింది. ఆ కుటుంబంలో ఉన్న ఇద్దరు అబ్బాయిలు, విల్‌హెల్మ్‌ అలాగే వుల్ఫ్‌గ్యాంగ్‌ నాజీ సైన్యానికి మద్దతు ఇవ్వనందుకు చంపబడ్డారు. ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడైన పాల్‌-జెరాడ్‌ కుసెరో మాత్రమే ఇప్పటికీ బ్రతికున్నాడు, ఆయన ఇలా అంటున్నాడు: “మిలిటరీలో చేరడానికి ఒప్పుకోనందుకే మా అన్నలను చంపేశారు. అలాంటిది మా కుటుంబానికి సంబంధించిన డాక్యుమెంట్లను, వస్తువులను ఒక మిలిటరీ మ్యూజియంలో పెట్టడం అస్సలు సరికాదని నాకు అనిపిస్తుంది.” ముఖ్యంగా ఈ తప్పును సరిదిద్దడానికే మన సంస్థ ఆ డాక్యుమెంట్లను సంపాదించడానికి ప్రయత్నిస్తుంది.

అంతేకాదు ఆ కుటుంబంలో అందరికంటే పెద్దమ్మాయి అయిన ఆన్‌మరీ కుసెరో చాలా కష్టపడి సేకరించిన ఆ డాక్యుమెంట్లను జర్మనీలో ఉన్న యెహోవాసాక్షుల సంస్థకు చట్టపరంగా ఇచ్చినట్టు నిరూపించడానికి యెహోవాసాక్షుల దగ్గర అవసరమైన దస్తావేజులు ఉన్నాయి. ఆమె 1,000 కన్నా ఎక్కువ వస్తువులను సేకరించింది. వాటిలో ఫోటోలు, బొమ్మలు, చనిపోవడానికి ముందు రాసిన ఉత్తరాలు, మరణ శిక్ష ప్రకటనలు, అలాగే నాజీ ప్రభుత్వం కోసం పనిచేసిన పోలీసుల b రిపోర్టులు కూడా ఉన్నాయి.

ఆన్‌మరీ 2005​లో చనిపోయింది. ఆ తర్వాత ఆమె సేకరించిన డాక్యుమెంట్లు బుండేస్వేర్‌ మిలిటరీ మ్యూజియం అధికారులు తీసుకున్నారని యెహోవాసాక్షులు తెలుసుకున్నారు. ఆ డాక్యుమెంట్లన్నిటినీ కుసెరో కుటుంబంలో ఉన్న ఒకరి దగ్గర నుండి న్యాయంగా, నిజాయితీగానే కొన్నామని మ్యూజియం అధికారులు చెప్తున్నారు. వాటిని అమ్మే సమయానికి ఆ వ్యక్తి ఒక యెహోవాసాక్షి కాదు, ఆయన ఆ తర్వాత చనిపోయాడు.

మన సంస్థ దాదాపు ఏడు ఏళ్లుగా మ్యూజియం అధికారులతో ఈ విషయాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ అలా జరగనందుకు తమకు చెందిన దాన్ని తిరిగి పొందడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఆ డాక్యుమెంట్లను జర్మనీలోని సెంట్రల్‌ యూరప్‌ కార్యాలయంలో ఉన్న మ్యూజియంలో ప్రదర్శించాలని యెహోవాసాక్షులు కోరుకుంటున్నారు. అప్పుడు వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన వేలమంది సందర్శకులు వాటిని ఉచితంగా చూడగలుగుతారు. అలాగే కుసెరో కుటుంబం చూపించిన చెక్కుచెదరని విశ్వాసం గురించి తెలుసుకోగలుగుతారు. c

a ఇది జర్మనీలోని యెహోవాసాక్షుల సంస్థ చట్టపరమైన పేరు.

b వాళ్లను గెస్టాపో అనేవాళ్లు.

c కోవిడ్‌ కారణంగా ఇప్పుడు టూర్లను నిలిపివేయడం జరిగింది. కానీ కోవిడ్‌కు ముందు ప్రతీ సంవత్సరం, ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల నుండి వేలమంది సాక్షులు, ఆసక్తిపరులు మ్యూజియం చూడడానికి వచ్చేవాళ్లు.